- గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్ నాగబాబు
గుంటూరు: ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగాలు లభించడం కష్టంగా మారిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తగ్గిపోయాయని ఎపి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్ ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా లాం గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఎఐ వలన ఉద్యోగం అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని, కావున విద్యార్థులు విద్యాతోపాటు ఆదాయ వనరులను ఎంచుకోవాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటి కోర్సుల ద్వారా ఆదాయం పొందే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. సాధారణంగా చైనా మరియు అమెరికా వంటి దేశాల్లో మిడుతలను పెంచి, ఎండబెట్టి, పౌడర్ చేసి ప్రొటీన్ పౌడర్‌గా ఉపయోగిస్తున్నారని, అలాగే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా నుండి ఆయిల్ తీసి, మిగిలిన డ్రై పౌడర్‌ను ప్రొటీన్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. మన దేశంలో బెంగళూరుకు చెందిన లూపామ్ అనే సంస్థ ఇప్పటికే భారతదేశంలో ఈ తరహా ఉత్పత్తులపై పనిచేస్తోందని, భవిష్యత్తులో ఆహారపు అలవాట్లు మారి ఇలాంటి ప్రొటీన్ ఆధారిత ఆహారాలకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు కనుగొనాలని, తద్వారా నలుగురికి ఉపాధి చూపే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముందుగా కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో డిఎఫ్ ఒ శైలజ, ఎఫ్ఆర్ఒ పోతురాజు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)