శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నవంబర్‌ 1 నుంచి ఖరీఫ్‌ ధాన్యం సేకరణ

10 గంటల క్రితం

nadendla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 37 లక్షల టన్నుల లక్ష్యం

- రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఖరీఫ్‌ ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు. నవంబర్‌ 1 నుంచి సేకరణ ప్రారంభించనున్న ప్రభుత్వం 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, దిగుబడి పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే సేకరణ పరిమాణాన్ని పెంచేందుకు కేంద్రంతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. విజయవాడ అంత్రాలక్స్‌ కన్వెన్షన్‌ హాలులో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సన్నద్ధత వర్క్‌షాప్‌ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున ఉత్పత్తి అంచనాలను మరోసారి సమీక్షిస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సేకరణ పరిమాణాన్ని పెంచుతామన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 2,619 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి నిర్వహణకు సుమారు 24 వేల మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం రవాణాకు జిపిఎస్‌ అమర్చిన దాదాపు 31 వేల వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. రైతులు సొంత వాహనాలతో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తే రవాణా ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. దాన్యం సేకరణకు అవసరమైన 6.10 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుతున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు సేవలందించడంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ, జాయింట్‌ కలెక్టర్లు, మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సేకరణ లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతోపాటు రైతులకు సహకరించాలని రైస్‌మిల్లర్లను కోరారు. వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కె కన్నబాబు, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సమూన్ వివరాలు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌‌సిఎస్‌‌సిఎల్‌ ‌ఛైర్మన్‌ తోట మెహర్‌ సీతారామ సుధీర్‌,ఎఎన్‌‌జిఆర్‌ఎయు వైస్‌ ఛాన్సలర్‌ పివి సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, సివిల్‌ సప్లైస్‌ అధికారులు, రైతులు, మిల్లర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్