ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరానికి తొలిసారి ఎన్‌డిఎస్‌ఎ బృందం

15 గంటల క్రితం

పోలవరానికి తొలిసారి ఎన్‌డిఎస్‌ఎ బృందం
- ప్రాజెక్టు భద్రతపై క్షేత్రస్థాయి పరిశీలన... జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 07:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రాజెక్టు భద్రతపై క్షేత్రస్థాయి పరిశీలన... జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష

ప్రజాశక్తి - పోలవరం : పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) ప్రతినిధి బృందం సందర్శించింది. ఆనకట్టల భద్రతకు సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు, భవిష్యత్తులో చేపట్టనున్న పర్యవేక్షణ వ్యవస్థలపై శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను సందర్శించి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. శనివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న ఎన్‌డిఎస్‌ఎ బృందానికి జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టు నమూనా ద్వారా నిర్మాణ స్వరూపాన్ని వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, వివిధ నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులు, మిగిలిన పనుల పురోగతిని తెలిపారు. విధ విభాగాల వారీగా పనుల పురోగతిని ప్రాజెక్టు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఇ) పి.రామచంద్రరావు వివరించారు. ​అనంతరం ఎన్‌డిఎస్‌ఎ బృందం ప్రాజెక్టులోని స్పిల్‌వే, గ్యాప్‌-1, గ్యాప్‌-2, ఇసిఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ తదితర నిర్మాణ ప్రాంతాలను సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతకు ప్రాధాన్యమిస్తూ తీసుకున్న చర్యలను ఎస్‌ఇ రామచంద్రరావు వివరించారు. ​ప్రాజెక్టు భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (స్కాడా) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ఎన్‌డిఎస్‌ఎ బృందానికి వివరించారు. సెన్సార్లు, మీటర్లు, వాల్వులు తదితర పరికరాల నుంచి రియల్‌టైమ్‌ డేటాను ఈ వ్యవస్థ సేకరిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో ఇఇలు బాలకృష్ణ, శ్రీనివాస్‌, సుబ్రహ్మణ్యం, ఎల్‌.వి.రావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్