ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యాలీఫ్లవర్‌తో కోరినట్లుగా..

34 నిమిషాల క్రితం

Best-Cauliflower-Varieties-Feature.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 10:13 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

క్యాలీఫ్లవర్‌లో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని కొన్ని ధాన్యాలకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగించవచ్చు. కాలీఫ్లవర్ ఒక ఆరోగ్యకరమైన క్రూసిఫెరస్ కూరగాయ. ఇది ముఖ్యంగా ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలను గణనీయంగా అందిస్తుంది. మీ భోజనంలో కాలీఫ్లవర్‌ను చేర్చుకోవడం వల్ల తక్కువ కేలరీలతో పోషకాలు లభిస్తాయి. మీరు క్యాలీఫ్లవర్‌ను భోజనంలో కలుపుకోవచ్చు లేదా పచ్చిగా స్నాక్‌గా తినవచ్చు. కొంతమంది దీనిని అన్నం లేదా పిజ్జా పిండికి ప్రత్యామ్నాయంగానూ ఉపయోగిస్తారు. క్యాలిఫ్లవర్‌తో రొటీన్ కూరలే కాకుండా క్రిస్పీ స్నాక్స్ నుంచి రిచ్ గ్రేవీ కర్రీస్ వరకు నాలుగు అద్భుతమైన వెరైటీలను ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.


Gobi-Manchurian-HOHV.jpg

ఆలూ గోబీ మసాలా

కావలసినవి: క్యాలిఫ్లవర్ ముక్కలు-2 కప్పులు, బంగాళాదుంప ముక్కలు - కప్పు, ఉల్లిపాయ -1, టొమాటోలు -2, అల్లం వెల్లుల్లి పేస్ట్ -స్పూన్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, నూనె, ఉప్పు తగినంత.

తయారీ: ముందుగా క్యాలిఫ్లవర్ ముక్కలను వేడి నీటిలో ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాలు ఉంచి వడకట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు క్యాలిఫ్లవర్, బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలిపి, మూత పెట్టి సన్నని మంటపై మెత్తగా ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి దించేయాలి. ఇది చపాతీలు, అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది.


Gobi-Manchurian-cover-photo-on-white-tile-1-of-1.jpg

క్రిస్పీ గోబీ మంచూరియా

కావలసినవి: క్యాలిఫ్లవర్ ముక్కలు-2 కప్పులు, మైదా-4 స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ -4 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు- తగినంత, నూనె - డీప్ ఫ్రైకి, సాస్ కోసం తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్ తీసుకోవాలి.

తయారీ: శుభ్రం చేసిన క్యాలిఫ్లవర్ ముక్కలకు మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కొద్దిగా, నీరు కలిపి పిండి పట్టేలా కలపాలి. వీటిని వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. అందులో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్ కొద్దిగా కార్న్‌ఫ్లోర్ నీళ్లు వేసి చిక్కబడే వరకు ఉడికించాలి. వేయించి పెట్టుకున్న గోబీ ముక్కలను ఈ సాస్‌లో వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి ఇది అద్భుతమైన ఇండో-చైనీస్ స్నాక్.


gobi-paratha-recipe.jpg

గోబీ పరాఠా

కావలసినవి: గోధుమపిండి -2 కప్పులు, తురిమిన క్యాలిఫ్లవర్ -1.5 కప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, వాము, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు - తగినంత, నెయ్యి/నూనె - సరిపడా.

తయారీ: గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, నూనె నీళ్లు పోసి మెత్తని చపాతీ పిండిలా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తురిమిన క్యాలిఫ్లవర్‌లో నీరు లేకుండా గట్టిగా పిండాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, వాము, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి ముద్దను కొద్దిగా ఒత్తి, మధ్యలో క్యాలిఫ్లవర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. దీనిని మెల్లగా పరాఠాలా ఒత్తి, పెనంపై రెండు వైపులా నెయ్యి రాస్తూ ఎర్రగా కాల్చుకోవాలి.


images(3).jpg

ఆవకాయ

కావలసినవి : క్యాలిఫ్లవర్ ముక్కలు- 4 కప్పులు, కారం - అర కప్పు, ఆవపిండి- పావు కప్పు, మెంతిపిండి-టీస్పూన్, ఉప్పు-పావు కప్పు, నిమ్మరసం- పావు కప్పు, పసుపు-అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు- 15 నుంచి 20 (పొట్టు తీసినవి, కొన్ని కచ్చాపచ్చాగా దంచినవి), వేరుశనగ నూనె : కప్పు.

తయారీ : ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, స్టవ్ ఆపేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు క్యాలిఫ్లవర్ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉంచాలి. దీనివల్ల ముక్కల్లో ఉండే పురుగులు, మలినాలు తొలగిపోతాయి. వెంటనే నీటిని వడకట్టి, ముక్కలను ఒక పొడి కాటన్ వస్త్రంపై వేసి తడి ఏమాత్రం లేకుండా ఫ్యాన్ కింద లేదా ఎండలో మూడు గంటల పాటు పూర్తిగా ఆరబెట్టాలి. తడి లేని ఒక వెడల్పాటి గిన్నెలో ఆరబెట్టిన క్యాలిఫ్లవర్ ముక్కలను తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు వెల్లుల్లి రెబ్బలు వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఒక పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో టీస్పూన్ ఆవాలు, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాతే క్యాలిఫ్లవర్ మిశ్రమంలో పోయాలి. వేడి నూనె పోస్తే ముక్కలు మెత్తబడి పచ్చడి త్వరగా పాడవుతుంది. చివరగా నిమ్మరసం కూడా వేసి అంతా బాగా కలిపి, తడి లేని గాజు లేదా జాడీ సీసాలోకి తీసుకోవాలి. పచ్చడిని మూడు రోజుల పాటు కదపకుండా పక్కన ఉంచాలి. మూడో రోజు నూనె పైకి తేలి ముక్కలు బాగా ఊరుతాయి. అప్పుడు మరోసారి శుభ్రమైన, పొడి గరిటెతో పచ్చడిని కలిపి ఉప్పు, పులుపు సరిచూసుకోవాలి. ఒకవేళ నూనె తక్కువగా అనిపిస్తే మరికొంత నూనె వేడి చేసి, చల్లార్చి కలుపుకోవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్