ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

1 గంట క్రితం

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 10:57 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో సిఎం చంద్రబాబు నాయుడు

- జిజి 3, 1/70లపై నిర్ధిష్ట హామీ ఇవ్వని ముఖ్యమంత్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆదివాసీల సమగ్రాభివృద్ధికి 5 అంశాలతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఆదాయ వనరుల పెంపు, నైపుణ్య శిక్షణ లాంటి ఐదు అంశాల్లో ఆదివాసీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్‌ ‌కళా వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అయితే, కొంత కాలంగా జిఒ 3, 1/70 చట్టం పరిరక్షణకు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం శనివారం మన్యం బంద్‌ ‌విజయవంతంగా నిర్వహించారు. ఈ రెండు చట్టాల పరిరక్షణకు సంబంధించి ఈ కార్యక్రమం వేదికగా నిర్ధిష్టమైన హామీని ముఖ్యమంత్రి ఇవ్వలేదు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆదివాసీల కోసమే 3 ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసి వారికి ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. ఎటు చూసినా పచ్చదనం కలిగిన ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని కూడా గణనీయంగా ప్రోత్సహిస్తామన్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం ఈ వేదికపై చేసుకున్న 19 ఎంఓయూల ద్వారా 60 వేల మందికి లబ్ది కలుగుతుందని తెలిపారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు కూడా వారిని సిద్ధం చేసి అందరితో పోటీ పడేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. 2000లో తెచ్చిన జిఒ 3 ద్వారా గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేశామని, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ జీవోను కొట్టివేశారు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందేలా రూ.250 కోట్లతో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం, శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం అభివృద్ధి కోసం అంతా సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ

భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని, విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన బిడ్డలు ధింసా నృత్యం ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందన్నారు. ఈ రికార్డు సాధించి మన సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. పోడు వ్యవసాయం కాదు, ఆర్గానిక్ వ్యవసాయంతో గిరిజనులు విలువైన పంటల్ని ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూ.4,764 కోట్లను కేటాయించాం. ఐటీడీఏలతో గిరిజన అభివృద్ధి కోసం జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పన, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్య కల్పనపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. 2,336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్ లో రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. 2027 నాటికి ప్రతీ గిరిజన కుటుంబానికీ సురక్షితమైన తాగునీరు, ఆవాసం కల్పిస్తామన్నారు. ప్రపంచ బ్రాండ్ గా అరకు కాఫీ ఎదిగింది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని, కాఫీ, మిరియాలు, పసుపు లాంటి వాణిజ్య పంటలకు బ్రాండ్ గా ఏజెన్సీ ప్రాంతం మారాలని ఆకాంక్షించారు. పార్లమెంటు లోనూ అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని అటవీ ఉత్పత్తులకు విలువ జోడించటం ద్వారా మంచి మార్కెటింగ్ కల్పిస్తామని తెలిపారు. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనా పిల్, తేనె, తాటి బెల్లం ఇలా ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, బ్రాండింగ్ వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం అంబేద్కర్ కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సిఎం పరిశీలించారు. పాడేరు, రంపచోడవరం, నల్లమల, అరకు, చింతపల్లి, పార్వతీపురం మన్యం తదితర ప్రాంతాల నుంచి ఉత్పత్తులు తయారు చేసి ప్రదర్శించిన గిరిజన మహిళల్ని అభినందించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండ్ రూపొందించి మార్కెటింగ్ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ధింసా నృత్యంతో డప్పు, వివిధ వాయిద్యాలతో గిరిజన మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామమోహన్‌, నిమ్మక జయకృష్ణ, జిసిసి ఛైర్మన్‌ ‌కిడారి శ్రావణ్‌ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్