గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నగరంలో ముంపు నివారణ చర్యలు చేపట్టాలి : సిపిఎం డిమాండ్

51 నిమిషాల క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

...వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం బృందం

...మెయిన్ డ్రైన్స్ పూడికలు ముందుగా తీయించి ఉంటే ముంపు సమస్య తగ్గేది

...వర్షాలు కొనసాగితే జీవనోపాధి దెబ్బతింటున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

...అవసరమైన ప్రాంతాల్లో భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అదనపు కమీషనర్ సుధాకర్

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో అధికార యంత్రాంగం ముంపు నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ తో పాటు మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ళ పద్మ లతో కూడిన బృందం నగరంలో సినిమా రోడ్, జగన్నాధపురం ముగ్గుపేట, జె. రామారావు పేట, మహాలక్ష్మి నగర్, ముత్తానగర్, గోళీలుపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలివెల వీరబాబు, మలక వెంకటరమణ లు మాట్లాడుతూ.. ఈ సీజన్ లో ఇప్పుడే పెద్ద ఎత్తున నగరంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో మెయిన్ డ్రైన్స్ పూడికలు తీయించాలని కోరుతూ సిపిఎం బృందం అధికారులకు విన్నవించడం జరుగుతుందన్నారు. చెత్త సేకరణ పై చూపినంత శ్రద్ధ డ్రైన్ క్లీనింగ్ పై చూపడం లేదని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. మరొక ప్రక్క మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ లో శాశ్వత సిబ్బంది రిటైర్డ్ అయిపోవడం, పెరిగిన జనాభాకు తగిన విధంగా సిబ్బంది లేకపోవడం కూడా శానిటేషన్ సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయన్నారు. స్మార్ట్ సిటీలో వందల కోట్ల రూపాయల ఖర్చు జరిగి కొంత వరకు అభివృద్ధి పనులు జరిగినా, నగరంలో ముంపు సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు మెయిన్ డ్రైన్స్ పూడికలు తీయించి, నగరాన్ని ముంపు బారి నుండి రక్షించాలని కోరుతున్నామన్నారు. అనేక ప్రాంతాల్లో, నివాసాల వీధుల్లో మురికినీరు, వర్షపు నీరు కలిసిపోయి నిలిచి పోయిందన్నారు. దీనివల్ల ప్రజలు రోగాల బారినపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. గత నాలుగేళ్లుగా పాలకవర్గం లేకపోవడం వల్ల కూడా నగరంలో ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదన్నారు. వర్షాలు కొనసాగితే ముంపు ప్రాంతాల్లో పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో ఆహార సదుపాయాలు కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించిన అదనపు కమీషనర్ కె. టి. సుధాకర్ కి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్