ప్రజాశక్తి- యు. కొత్తపల్లి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రహదారులు వర్షపు నీటితో జలమయంగా మారాయి. ఉప్పాడతో పాటు సమీప గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుబ్బంపేట సమీపంలోని పాఠశాల ఆవరణలోకి వర్షపు నీరు చేరి నీటిమయంగా మారింది. ఉప్పాడ, తదితర గ్రామాల్లో ప్రధాన రహదారులు సైతం వర్షపు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు, తోటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు మరింత కొనసాగితే పంటలకు, ప్రజలకు నష్టం పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి, నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)