ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సాయం అవసరం

15 నవంబర్, 2026

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:01 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- కేంద్ర బృందంతో సిఎం చంద్రబాబు నాయుడు

- కోస్తాంధ్రలో మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం సహకరించాలి

- మురసుతో రాష్ట్రానికి రూ.2,484 కోట్ల నష్టం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సహాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి తెలిపారు. మురసు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వర్చువల్‌గా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. రాష్ట్రంలో ఎల్‌నినో, వరుస తుఫాన్ల వల్ల ఎదుర్కొంటున్న పరిస్థితులను ముఖ్యమంత్రి వివరించగా, తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలను కేంద్ర బృందం ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. వరుస తుఫాన్ల‌తో వ్యవసాయం సహా వివిధ రంగాలకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. తీర ప్రాంతంలో తుఫాన్లకు దెబ్బతినకుండా మౌళిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ మేరకు కేంద్రం సహకారం ఇవ్వాలన్నారు. కేంద్ర బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ఇక్కడ జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో వివరించాలని కోరారు. వీలైనంత త్వరగా నివేదికను సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఏలూరు జిల్లాలో 90 శాతం పంట నష్టం

కేంద్ర బృందం తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ప్రత్తి వంటి వాణిజ్య పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు బీమా చేయించుకోలేదనే విషయాన్ని గుర్తించినట్టు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు తుఫాన్ కారణంగా దెబ్బతిన్నాయని, బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో మూడుసార్లు రేషన్ అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రీ-స్కూల్ యూనిఫామ్స్ అందించాలని, తుఫాన్ ప్రభావానికి గురైన గిరిజనులను ప్రత్యేకంగా ఆదుకోవాలని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ నష్టపోయిన రైతులకు అధిక పరిహారం అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అర్నబ్ తుఫాన్‌తో పోలిస్తే మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో వరి పంటకు 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకూ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఉద్యాన పంటల్లో మామిడి, బొప్పాయి ఎక్కువగా దెబ్బతిన్నాయని వివరించింది. దాదాపు 60 ప్రాంతాల్లో పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించినట్లు వెల్లడిచింది.

1.43 లక్షల హెక్టార్లలో పంట నష్టం

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం మురసు తుఫాన్ కారణంగా మొత్తం రూ.2,484 కోట్ల మేర నష్టం సంభవించింది. ఇందులో రహదారులు, వ్యవసాయం, ఉద్యాన పంటలు, విద్యుత్ వ్యవస్థలు, ఇళ్లు, సాగునీటి వనరులతో పాటు పలు ఇతర రంగాలు ఉన్నాయి. తుఫాన్ కారణంగా 1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటివల్ల రూ.888 కోట్ల విలువైన రహదారులకు నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో 220 కిలోమీటర్ల మేర 114 రహదారులు దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగంలో 1,43,617 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, రూ.875 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తం 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు. ఉద్యాన పంటలకు సంబంధించి 6,756 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, రూ.337 కోట్ల నష్టం సంభవించింది. 12,605 మంది రైతులు నష్టపోయారు. సాగునీటి రంగంలో 369 వనరులు దెబ్బతినగా, 509 చోట్ల గండ్లు పడ్డాయి. విద్యుత్ రంగంలో 10,192 11 కేవీ స్తంభాలు, 6,442 ఎల్‌టీ స్తంభాలు, 1,448 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.37 కోట్లు ఖర్చుపెట్టింది. తుఫాన్ ప్రభావంతో మొత్తం 3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ, మత్స్యశాఖ, పురపాలక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పాఠశాలలు, పశుసంవర్ధక, చేనేత రంగాల్లోనూ నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో వివరించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్