- వర్షాభావంలో 85 శాతం రాష్ట్రం
- 48 శాతం లోటు
- ప్రస్తుత వానల *ఉపశమనం స్వల్పమే
- జలాశయాల్లోకి నీటి రాక కాస్తంత ఊరట
- కృష్ణా డెల్టాలో వరి సాగుపై అస్పష్టతే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఒక వైపు బలహీనంగా నైరుతి రుతుపవనాలు ఇంకో వైపు సూపర్ ఎల్‌నినో కూడబలుక్కొని దాడి చేయడంతో క్రమేపి రాష్ట్రం కరువులోకి జారుతోంది. ఖరీఫ్‌లో రెండు మాసాలు ముగిసి మూడవ మాసం ఆగస్టులో వారం గడిచాక కూడా సాగు సాగడానికి సరిపడ వానల్లేవు. రాష్ట్రంలో 85 శాతం భూభాగం వర్షాభావంలో మగ్గుతోంది. అందులోనూ 23 శాతం భూభాగం అత్యల్ప వర్షం (లోటు 60-99 శాతం)తో నేలలు నెర్రెలిచ్చింది. మరో 62 శాతం భూభాగం తక్కువ వర్షం (లోటు 20-59 శాతం)తో అనావృష్టి తాండవిస్తోంది. కేవలం 15 శాతం రాష్ట్రంలోనే పరిస్థితి పర్వాలేదనిపిస్తోంది. అక్కడ కూడా ఆగస్టు మొదటి వారంలో వానలు పడటంతో కొత్తగా పంటల సాగుకు అదను తప్పింది. వేసిన పంటలు వర్షాలకు కాస్తంత తెప్పరిల్లినా అంతలోనే వానలు వెనుకపట్టు పట్టడంతో వర్షాభావం యథాస్థితికి చేరుతోంది. ఆగస్టు 8 సాయంత్రానికి రాష్ట్రంలో ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షం పడలేదు. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పవర్షం నమోదైంది. తతిమ్మా 25 జిల్లాలూ సాంకేతికంగా తక్కువ వర్షం కేటగిరిలో ఉన్నప్పటికీ శ్రీసత్యసాయి, మార్కాపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో లోటు 50 శాతానికి పైనే ఉంది.
అదే తీరు
జూన్‌లో సాధారణ వర్షంలో 26 శాతం తక్కువ వర్షం పడగా తదుపరి జూలైలో ఏకంగా 68 శాతం లోటు నెలకొంది. ఆగస్టు మొదటి వారంలో వాయుగుండం, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలతో కొన్ని చోట్ల అడపాదడపా పడ్డ వానలు రైతులను, అప్పటిదాకా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించాయి. ఆగస్టులో ఈ పాటికి పడాల్సిన వర్షంలో 6.9 శాతం తక్కువ. సాధారణస్థాయి కిందికే వస్తుంది. కాగా సీజన్ పరంగా జూన్ 1 నుంచి ఆగస్టు 8 వరకు చూస్తే లోటు 48 శాతంగా ఉంది. ఈ సమయంలో 289.9 మిల్లీమీటర్లకుగాను 151.82 మిమీ కురిసింది. కోస్తాలో 44 శాతం, రాయలసీమలో 46 శాతం లోటు కొనసాగుతోంది. ఎపిలో 688 మండలాలుండగా 586 మండలాల్లో వర్షాభావం నెలకొంది. అత్యల్ప వర్షం (స్కాంటి) 157 మండలాల్లో, తక్కువ వర్షం 429 మండలాల్లో నమోదైంది. కేవలం 102 మండలాల్లో సాధారణ వర్షం పడింది.
సాగని ఖరీఫ్
వర్షాభావంతో ఖరీఫ్ సేద్యం సాగట్లేదు. సీజన్ సాధారణ సాగు 77 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి కావాల్సిన విస్తీర్ణంలో దాదాపు 8 లక్షల ఎకరాలు తక్కువ సాగైనట్లు
తెలుస్తోంది. నూనెగింజల సాగు ఈ తడవ దాదాపు లేనట్లే. రాయలసీమలో వేరుశనగ మరీ దారుణంగా ఉంది. జూలై చివరి వరకు ఎగువన కూడా వర్షాల్లేని కారణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో డెడ్ స్టోరేజిలో ఉన్న శ్రీశైలానికి భారీగా వరద వచ్చింది. రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్ధ్యం 215 టిఎంసి కాగా వారం రోజుల్లో 47 నుంచి 173 టిఎంసిలకు చేరింది. పైనుంచి ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరి కొన్ని రోజుల్లో శ్రీశైలం పూర్తిగా నిండుతుంది. ఆ సంకేతాలొస్తున్నాయి. నాగార్జునసాగర్ కెపాసిటీ 312 టిఎంసి కాగా ప్రస్తుతం 140 టిఎంసి ఉన్నాయి. శ్రీశైలం నుంచి దిగువకు నీరు వదలట్లేదు. సాగర్ నుంచి పులిచింతలకూ ఇన్‌ఫ్లో లేదు. పులిచింతల కెపాసిటీ 45 టిఎంసి కాగా 16 టిఎంసి ఉన్నాయి. డెల్టా అవసరాలకు ఇటీవల కొన్ని నీటిని ప్రకాశం బ్యారేజికి విడుదల చేశారు. కృష్ణా డెల్టా అవసరాలకు జూలై 8న పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి నీటి తరలింపును ప్రారంభించారు. గోదావరిలో వరద పెరగడంతో 24 పంపుల్లో 20 పంప్‌ల ద్వారా రోజుకు కుడి కాల్వకు 5 వేల నుంచి 7 వేల క్యూసెక్కులను పంప్ చేస్తున్నారు. రాయలసీమకు తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయకపోవడంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ మొదటి నుంచీ కృష్ణా డెల్టాపై ప్రభుత్వం అనాలోచితంగా ప్రవర్తించినట్లు విమర్శలొస్తున్నాయి. ఏడాదికి ఇరిగేషన్ క్యాలండర్ విడుదల చేసినప్పుడు, ఆ తర్వాత వరికి నీళ్లిస్తామన్నారు. వర్షాల్లేకపోవడంతో తాగునీటికి, ఆరుతడి పంటలకేనన్నారు. ఇప్పుడు ఎగువ నుంచి వచ్చే నీళ్లతో రిజర్వాయర్లు నిండుతున్నా వరి సాగుపై స్పష్టత ఇవ్వట్లేదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది.
కాల్వల కింద సాగు తక్కువే
రాష్ట్రంలో 122 లక్షల ఎకరాల సాగు ఉండగా 80 లక్షల ఎకరాలకే ఏదొక నీటి వనరు ఉంది. తతిమ్మా 42 లక్షల ఎకరాల సాగు వర్షాధారమే. ఇరిగేషన్ సౌకర్యం ఉందంటున్న దాంట్లోనూ కాల్వల కింద సాగు 32 లక్షల ఎకరాలు కాగా చెరువుల కింద ఏడు లక్షల ఎకరాలు, ఇతర సదుపాయాల కింద రెండున్నర లక్షల ఎకరాలు. అత్యధికంగా 38 లక్షల ఎకరాలు బోరు బావులపై సాగవుతున్నాయి. భూగర్భజలాలు, విద్యుత్‌పైనే ఆధారం. ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాకు నీరివ్వకపోతే 13 లక్షల ఎకరాల్లో వరి ఉండదు. ఆరు తడి పంటలు ఏ మేరకు రైతులు వేస్తారో అనుమానమే.
ఆగస్టు 8 నాటికి వర్షాభావ మండలాలు
జిల్లా మొత్తంతక్కువఅత్యల్పం
మండలాలు వర్షంవర్షం
శ్రీకాకుళం301312
విజయనగరం281803
మన్యం150904
అల్లూరి110902
పోలవరం 121001
విశాఖపట్నం110902
అనకాపల్లి242200
కాకినాడ211901
కోనసీమ191404
తూర్పుగోదావరి221507
పశ్చిమగోదావరి201406
ఏలూరు281805
కృష్ణా261604
ఎన్‌టిఆర్201800
గుంటూరు181402
బాపట్ల201206
పల్నాడు281309
మార్కాపురం211208
ప్రకాశం281512
నెల్లూరు362202
కర్నూలు271602
నంద్యాల302405
అనంతపురము322101
శ్రీసత్యసాయి321709
కడప402411
అన్నమయ్య250520
చిత్తూరు281017
తిరుపతి362006
రాష్ట్రం688429157








కామెంట్‌లు (0)