శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు మెడపై అసైన్డ్ భూముల కత్తి!

3 రోజుల క్రితం

land
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 05:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రీ-సర్వేలో సుమారు 300 ఎకరాల భూములకు నోటీసులు

- గతంలో ఆన్‌లైన్ నమోదుకు ఎకరాకు రూ.10 వేల వరకు ఇచ్చామంటున్న రైతులు

- డబ్బులు ఇచ్చిన వారికి నోటీసులు రాకుండా చేశారంటూ ఆరోపణలు

- ఆధారాలు లేకుంటే గతంలో ఆన్‌లైన్ ఎలా చేశారంటూ అధికారులకు నిలదీత

- అక్రమ నమోదులకు బాధ్యులైన అధికారులపై చర్యలు ఉండవా?

అర్ధవీడు: ప్రకృతి ప్రకోపంతో పంట నష్టపోయే రైతులకు ఇప్పుడు రెవెన్యూ నోటీసుల రూపంలో మరో కష్టం ఎదురైంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములపైనే హక్కుల ఆధారాలు చూపించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం పాపినేనిపల్లి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రీ-సర్వే ప్రక్రియలో భాగంగా సుమారు 300 ఎకరాల భూములకు సంబంధించి రైతులకు నోటీసులు అందడంతో తమ భూముల పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గతంలో భూముల ఆన్‌లైన్ నమోదు కోసం ఎకరాకు రూ.10 వేల వరకు రెవెన్యూ అధికారులకు ముట్టచెప్పినట్లు రైతులు ఆరోపిస్తుండటం ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.

ఆన్‌లైన్ చేసిన భూములకే నోటీసులా?

పాపినేనిపల్లి పరిధిలోని పలువురు రైతులు గత పదేళ్లుగా తమ భూములను సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకునేందుకు ఎకరాకు రూ.10 వేల వరకు అప్పటి రెవెన్యూ అధికారులకు ఇచ్చినట్లు రైతులు వాపోతున్నారు. ఆ తర్వాత ఆయా భూములు ఆన్‌లైన్‌లో నమోదవడంతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడంతోపాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా పొందారు. ఇన్నేళ్లుగా సాగులో ఉన్న భూములకు ఇప్పుడు ఆధారాలు చూపించాలంటూ నోటీసులు ఇవ్వడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు సరైన ఆధారాలు లేవని అధికారులు భావిస్తే, గతంలో అవే భూములను వెబ్‌ల్యాండ్‌లో ఏ ప్రాతిపదికన నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు.

నోటీసుల జారీలోనూ వివక్ష?

రీ-సర్వే సమయంలో కొంతమంది రైతులకు నోటీసులు జారీ చేయగా, మరికొందరికి ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రీ-సర్వే సమయంలో సిబ్బందికి డబ్బులు ముట్టచెప్పిన వారికి నోటీసులు రాకుండా జాగ్రత్త పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన వారిని ఒకలా, ఇవ్వని వారిని మరోలా చూశారా? అన్న సందేహాలను బాధిత రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? నోటీసుల జారీలో అధికారులు ఏ ప్రాతిపదికను అనుసరించారన్నది ఉన్నతాధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

అధికారుల తప్పిదాలకు రైతులే బాధ్యులా?

రైతులకు జారీ చేసిన నోటీసులు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం–1977, 2007 నిబంధనల్లోని రూల్–3 ప్రకారం ఫారం–2 రూపంలో ఉన్నాయి. భూములను బదిలీ ద్వారా పొందినట్లు పేర్కొంటూ నోటీసులు జారీ చేసిన అధికారులు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. అయితే గతంలో రెవెన్యూ రికార్డుల్లో భూములను ఆన్‌లైన్ చేసినప్పుడు అనుసరించిన విధానాలు, పరిశీలించిన ఆధారాలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నమోదులు జరిగి ఉంటే అందుకు బాధ్యులైన అప్పటి అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేక వారి తప్పిదాలకు రైతులే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా? అన్న ప్రశ్నలు బాధితుల్లో వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్