- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ప్రాధాన్యత
- డేటా సెంటర్లకు నీటి సీటి సరఫరాపై దుష్ప్రచారం
- నెలవారీ లక్ష్యాలతో ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తి
- జలవనరుల శాఖ సమీక్షలో సిఎం చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారం నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగు నీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార- జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తదుపరి పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ సీజన్ లో ఆరు తడి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగేలా జల ధార- జల హారతి పనులను కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్న రాష్ట్రంగా గోదావరి నీటిని అటు ఉత్తరాంధ్రకు, ఇటు కృష్ణా డెల్టా ప్రాంతానికి అవసరమైనంత మేర నీరు తీసుకునే ఆస్కారం ఉందన్నారు. విశాఖ నుంచి అమరావతి వరకూ అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న భూములను సద్వినియోగం చేసుకునే అవకాశాలను అధ్యయనం చేయాలని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను కూడా మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోకా పూర్తి చేయాలన్నారు. దీనికోసం నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఆయకట్టుకు నీరిచ్చే అంశాన్ని కూడా అధ్యయనం చేయాలని సిఎం సూచించారు.
పోలవరం ప్రాజెక్టులో 89.90 శాతం పనులు
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు జల వనరుల శాఖ అధికారులు సిఎంకు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు శరవేగంగా చేపట్టామని వివరించారు. ఇటీవల 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు గోదావరికి వచ్చినా ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించినట్టు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రహదారులతో పాటు డ్యామ్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు కూడా చేపట్టాలని సిఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలో గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్ ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.. వచ్చే ఏడాది మార్చి కల్లా విశాఖ వరకూ ఎడమ కాలువ బ్యాలెన్సు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈలోగా అనకాపల్లి వరకూ ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిని నింపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలవరం కుడి ఎడమ కాలువల్లో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా పనులు చేయాలని స్పష్టం చేశారు. రెండు కాలువలకూ మంచి పేర్లను సూచించాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో ప్రాంతాలను సద్వినియోగం చేసుకోడటంతో పాటు పర్యాటకం గానూ తీర్చిదిద్దాలన్నారు.
డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీరు చాలు
డేటా సెంటర్లకు నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మొత్తంగా వాటికి 3.5 టిఎంసిల నీరే సరిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. డేటా సెంటర్ల విషయంలో జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధానకార్యదర్శి శశిభూషణ్ కుమార్ హాజరయ్యారు.








కామెంట్‌లు (0)