శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వానాకాలంలోనూ నీటి కరువు!

02 ఆగస్టు, 2026

water
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 2.95 మీటర్లు అడుగుకు నీరు

- శెట్టూరులో అత్యధికం 15.50 మీటర్లలోతుకు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : వానాకాలంలోనూ భూగర్భ జలమట్టం అడుగునకే చేరుతోంది. వేసవి కాలం అంటే అధికంగానే నీటిమట్టం పడిపోతోంది. గతేడాదితోపోలిస్తే ఈసారి 2.95 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. అనంతపురం జిల్లాలో జూన్‌ లో ఒకింత వర్షపాతం నమోదైనా జులైలో తీవ్ర వర్షాభావం నెలకొంది. దీంతో, భూగర్భ జలాలు వర్షాకాలంలోనూ పడిపోతున్నాయి. అనంతపురం, నార్పల, పుట్లూరు, తాడిపత్రి మండలాల్లో మినహా తక్కిన అన్ని మండలాల్లో నీటిమట్టం గతేడాది ఆగస్టు కంటే అధిక లోతుకుపడిపోయింది. అత్యధికంగా శెట్టూరు మండలంలో గతేడాది కంటే 15.50 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. గతేడాది ఆగస్టు 27.66 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంటే ఈసారి అది 43.17 మీటర్ల లోతుకు పడిపోయింది. కుందుర్పి మండలంలో అంతకుమునుపు ఏడాది ఆగస్టులో 15.43 మీటర్లలో నీరు ఉంటే, ఇప్పుడది 27.44 మీటర్ల లోతుకు పడిపోయింది. 12.01 మీటర్లలోతుకు పడిపోయింది. కళ్యాణదుర్గంలో 17.71 నుంచి 28.52 మీటర్లు అంటే పది మీటర్ల కంటే ఎక్కువ నీటిమట్టం ఈ ఏడాది తగ్గిపోయింది. డీ.హీరేహళ్‌, బొమ్మనహళ్‌, కణేకల్‌ ‌తదితర మండలాల్లోనూ నీటిమట్టం ఐదు మీటర్ల వరకు గతం కంటే ఎక్కువ లోతుకు నీరు చేరింది. మండు వేసవి మే మాసం కంటే కూడా ఎక్కువ మండలాల్లో నీటిమట్టం ఆగస్టులో మడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జులైలో తీవ్ర వర్షాభావం

జిల్లాలో జూన్‌, జులై నెలల్లో 126.9 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉంది. 87.4 మిల్లీమీటర్లే నమోదైంది. అంటే, 31.1 శాతం లోటు ఉంది. జూన్‌ ‌లో 68.11 మిల్లీమీటర్లు నమోదైనట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. జులైలో సాధారణ వర్షపాతం 64.3 మిల్లీమీటర్లు. 18.8 మిల్లీమీటర్ల మాత్రమే నమోదైంది. 70.8 శాతం వర్షపాతం లోటు ఉంది. యల్లనూరు, పుట్లూరు, వజ్రకరూరు, గుత్తి , తాడిపత్రి మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలాల్లో సాధారణ కంటే 60 శాతం వర్షపాతం లోటుంది. 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటున్న వర్షాభావ మండలాలు 16 ఉండగా, సాధారణ వర్షపాతం పడినవి ఎనిమిది ఉన్నాయి. మూడు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.

తాగు, సాగు నీటికి ఇక్కట్లు

భూగర్భ జలాలు కూడా పడిపోతుండటంతో తాగు, సాగు నీటికి ఇక్కట్లు మొదలవుతున్నాయి. తాగు నీటి కోసం కళ్యాణదుర్గం ప్రాంతంలో మహిళలు ఇదివరకే ఆందోళనలు చేపట్టారు. వజ్రకరూరు మండలంలోనూ గతంలో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్