‘నేనింక చదవను టీచర్!’
రత్న వాట్సప్ మెసేజ్ చూసి మాధురి విస్తుపోయింది. ‘ఇప్పుడు చదువు మానేసి ఏం చేద్దామని?’ అసహనంగా తిరిగి మెసేజ్ చేసింది.
‘నాకోసం నాన్న చాలా కష్టపడుతున్నాడు. నేనేదైనా ఉద్యోగంలో చేరి నాన్న కష్టం తగ్గిస్తాను.’
‘నువ్వు పాసైంది పదోతరగతి మాత్రమే. నీకేం ఉద్యోగం వస్తుందనుకుంటున్నావు? నువ్వు చదువు మానేస్తే మీ నాన్న కష్టం తీరుతుందా? ఆటో తోలడం మానేస్తాడా? అసలు మీ నాన్న గురించి నీకేం తెల్సు? నా బిడ్డకు చదువు చెప్పు టీచర్! నీ కాల్మొక్కుతా అనేవాడు. నువ్వు బాగా చదువుకుని, పెద్ద నౌకరీ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. అందుకే నువ్వు చదువుకోవాలి.’ రత్నకు హితబోధ చేసింది.
ఎవరి ప్రమేయం లేకుండా కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది. రత్న ఇంటర్, డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాసైంది. అవరోధాలను దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు రత్న అధిగమిస్తూంటే, ఆమెను మొదటిసారి చూసిన సంగతి గుర్తుకొచ్చి మాధురి ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.
ఆటోలో నిద్రపోతున్న పిల్లను చూసి, ‘యాదగిరి! ఎవరీ అమ్మాయి?’ అడిగింది టీచర్ మాధురి.
‘నా బిడ్డమ్మా. ఊకే మాయమ్మను సతాయిస్తుంటే ఆమె పేనం ఇసిగిపోయి నాతో తోడ్కపొమ్మంది. జర సివరగా అది కూసొంటాది. మరేమనుకోకు తల్లీ.’
‘పర్లేదులే. ఏం పేరు?’ అడిగింది. జవాబివ్వకుండా దిక్కులు చూస్తున్న ఆ పిల్లను మళ్ళీ అడిగింది.
‘అది సెవిటిది టీచరమ్మ.’ ఆటో స్టార్ట్ చేస్తూ అన్నాడు యాదగిరి.
‘చెవిటిదా? పుట్టుక నుంచా?’ ఆశ్చర్యపోతూ అంది.
‘లేదమ్మా. గప్పుడు లుంబినీ పార్కులో బాంబులు పేలినాయి నీకెరుకనే గదా. ఆ దినాన నా పెండ్లాము, ఈ పిల్ల ఆడనే ఉన్నారు. ఒల్లంతా గాయాలతో, పేనాపాయ స్తితిలో ఇద్దరినీ పోలీసులు దవాకానలో సేర్సిండ్రు. నా రాత బాలేక నా పెండ్లాం సనిపోయింది. సీకటైపోన బతుకులో నా కంటిదీపం నా బిడ్డ బతికితే సాలనుకున్నా. నెల దినాలపాటు దీన్ని దవాకానాలో వైద్దెం సేసాక బతికింది. గానీ, మెడలోనో, మెదడ్లోనో నాకెరుక లేదుగాని నరాలు దెబ్బతిని, దాని రెండు సెవులు ఇనిపించకుండా పోయినయి. ఇది సెవిటిదై పోయింది. అయిదు వరకు సదువుకుందని మల్లీ ఇస్కూలుకి పంపితే, తోటి పిల్లలు ‘‘సెవిటిది...సెవిటిద’’ ని గేలి సేస్తున్నారని ఇక పోనని మానేసింది. తర్వాత ఇంటికాడే పుత్తకాలట్టుకుని దేవుల్లాడుతాది. ఈమె మీద ఎన్నో ఆసెలు పెట్టుకున్నా. బాగా సదివింసాలి. పేద్ద నౌకరీ సంపాయించాలని అనుకున్నా. ఇట్టా జరిగినాక ఏంసేయ్యాలో పాలుపోతల్లె.’ గోల్లుమన్నాడు. సీటు కింద దాచిన న్యూస్ పేపర్ ఆమెకు చూపిస్తూ తన కలను చెప్పాడు.
దానిలో వార్తను చూసి, ‘నువ్వనుకుంటోంది కష్టమైన పనే. అసాధ్యం మాత్రం కాదు. రత్నకు చదవడం రాయడం వచ్చు, తనని నేను తీర్చిదిద్దుతాను, దిగులు పడకు. రత్న పేరు పెట్టినందుకు నీ బిడ్డ రత్నంలా రాణిస్తుంది. నీ కలను నిజం చేస్తుంది’ అనునయంగా అంది మాధురి.
ఇప్పుడు యాదగిరి కలను రత్న నిజం చేసింది.
‘టీచరమ్మా...! టీచరమ్మా...!’ అన్న పిలుపుతో వర్తమానంలో కొచ్చింది మాధురి. ఎదురుగా కన్నీళ్ళతో నిల్చున్న యాదగిరిని చూసి, ‘నీ కష్టం, కలలు ఫలించి రత్నకలక్టర్ అయ్యింది. మీ బస్తీలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆ కన్నీళ్ళేమిటి?’
‘ఏం సెప్పనమ్మా! ఆమె లోపమే సేపంగా మారిందమ్మా.’ ఓ కాగితాన్ని మాధురి చేతికిచ్చాడు. వినికిడి లోపమున్న రత్న అయ్యేయస్ హోదాకు అనర్హురాలని, ప్రత్యామ్నాయంగా వేరే ఉద్యోగానికి ఆమెను సెలెక్ట్ చేసినట్టు అధికార ఉత్తర్వును చదివి నివ్వెరపోయింది. న్యాయనిపుణులను సంప్రదించింది. సివిల్ సర్వీసెస్ నియమావళి, నిబంధనల ప్రకారం బధిరులకు అవకాశమియ్యాలన్న వారి సలహాతో రత్న చేత కమీషన్ కి విజ్ఞాపన పంపింది. ఆమె విజ్ఞాపనను అంగీకరించిన అధికారులు ఆమె లోప నివారణకున్న అవకాశాల కోసం వైద్య పరీక్షలకు ఆదేశించింది. రత్నకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ ద్వారా కోక్లియర్ ఇంప్లాంట్ అమర్చి,ఆమె వినికిడి లోపాన్ని సరిదిద్దవచ్చని వైద్యులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ మాటకు కొండంత దిగులు, కొనగోటితో పోయినట్టు సంతోషించాడు యాదగిరి. ఆపరేషన్ కు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని విని దిగులుపడ్డాడు. అంత డబ్బును పోగుచేయడం తన శక్తికి మించిన పననుకున్నాడు. తరిగిపోయిన దిగులు కొండలా పెరిగి తనకో సవాలుని విసిరిందనుకున్నాడు. ఏదేమైనా ఎవరెస్ట్ ఎదురొచ్చినా ఢీ కొట్టడానికి నిశ్చయించుకున్నాడు. అంతేకాని రత్న శ్రమ మాత్రం కొండెక్కకూడదని అనుకున్నాడు. ఆటో అమ్మేశాడు. ఇల్లు తనఖా పెట్టాడు. దొరికనచోటల్లా అప్పు చేసాడు. డబ్బు పోగు చేయడానికి యాదగిరి పడిన కష్టం దేవుడికే తెల్సు. రత్న చెవి ఆపరేషన్ విజయవంతమయ్యింది. కోక్లియర్ ఇంప్లాంట్స్ తో ఆమెకు పాక్షికంగా వినికిడి శక్తి వచ్చింది. సంయమనంతో ఆమె చేసిన పోరాటం ఫలించింది. వినికిడి లోపాన్ని అధిగమించిన రత్నను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఐఎఎస్ అధికారిగా ప్రకటించారు.
‘యాదగిరి నీ కష్టం గట్టెక్కింది. నీ బిడ్డ అయ్యేయస్ అయ్యింది. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని మీరిద్దరూ నిరూపించారు.’ మాధురి ఆనందాన్ని వ్యక్తపరిచింది.
‘ఇది కలా...! నిజమా...! తెల్వటలేదమ్మా. సంతోసం ఎక్కువై మతిలేనోడ్నయ్యాను. ఈ ఇజియం నిజంగా నాకే సెందుతుందా? మరి జనమనిస్సిన ఆ పిచ్చితల్లికి సెందదా?’ ఆవేదనగా అన్నాడు.
‘పిచ్చి తల్లా ? ఆమె ఎవరు?’ ఆశ్చర్యపోతూ అడిగింది.
‘అందరూ సంబురాలు సేసుకుంటున్న యేల రత్న కన్నతల్లిని యాది సేసుకోకపొతే అన్నేయం కదామ్మా. నీకో నిజం సెప్పనా, నా రత్నం నా కన్నబిడ్డ కాదమ్మా. ఆ రోజు... దిల్సుక్ నగర్ బస్టాండ్ కాడ ఉన్నానమ్మా. టైం రాత్రి తొమ్మిది. ఓ బస్సు వచ్చి ఆగింది. ‘దిగు... జల్దీ... మేం ఎమ్జీబికి పోయి రిటర్న్ పోవాలా దిగమ్మా.’ కండక్టర్ అరుస్తున్నాడు ఎవరి మీదో.
ఇంతలో ‘అమ్మో...! ఆ..ఆ...! ఓలమ్మా...!’ బాధతో అరుస్తూ గర్బంతో నున్న ఓ ఆడమనిషి బస్సు దిగడానికి రాక పోతోంది. సంకలో ఓ మూటట్టుకున్న ముసలమ్మ ఆమెకు సాయం సేస్తోంది. అక్కడ సేరినోల్లందరూ సోద్దెం సూస్తున్నారు. పురిటినొప్పులు కామోసు గుండెలదిరేలా అరుస్తోంది. ఎవరో తోసినట్టు బస్సులోంచి పడిపోయిందా ఆడమనిషి. ఆమె సీర రగతంతో తడిసిపోయింది. అలా ఓ ఆడమనిషి నడి రోడ్డుమీద సోయ లేకుండా పడుంటే నిమ్మకు నీరెత్తినట్టు జనం సూస్తున్నారు. ఫోనుల్లో ఈడియోలు తీసేస్తున్నారు. నేనిక ఆగలేక ఆమెను ఎత్తి ఆటోలో పండుకోపెట్టినా. ఆ ముసలమ్మను కూడా తీస్కోని దవాకానాకి తోల్కుపోయా. ఎమర్జేన్సిలో అగుపడ్డ నర్సమ్మాతో, ‘అమ్మా జర ఈమెను కాస్త సూడండమ్మా! నిండు గర్భిణీ, రగతం పోతోంది. జల్దీ సూడండమ్మా’ అంటూ దేవుల్లాడా. నర్సమ్మ నాడి సూసి. ‘చాలా బలహీనంగా, ప్రాణాపాయస్థితిలో ఉంది. డ్యూటీ డాక్టరమ్మ లేదంటూ ఓ సూది మందిచ్చింది. ఓ కాగితమిచ్చి, ‘ఇది పూర్తిచేసి తెల్ల కార్డు, ఆధార్ కార్డు కాపీలు జత సేసి అక్కడివ్వు.’ అంటూ కౌంటర్ ను సూపింది. నాకేం పాలు పోలా. ముసలమ్మ కోసరం సూసా. ఆమె అక్కడెక్కడా అగుపల్లా. బయటకు పోయి సూసాను. ఓ సెట్టుకింద మూటెట్టుకుని ఆమె నిదురోతోంది. ఆమెను తట్టి ‘నీ బిడ్డను దవాకానాలో సేర్సుకోడానికి ఇవరాలు కావాలి. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇయ్యి.’ అడిగాను.
“ఏమంటుండావ్...? అడుక్కునేటోదాన్ని నాకా పోరెవరో ఎట్లా తెలుస్తది.”
‘ఆమె నీ బిడ్డ కాదా? మరెవరు?’ అన్నాను.
“అదో పిచ్చిది. మా వూల్లె ఉంటాది. దానికెవురూ నేరు. ఎవుడో అగాయిత్తెం సెసిండు. కడుపొచ్చింది. నొప్పులతో అరుత్తా వుంటే ఆడ దవకాన నేక బస్సెక్కిపించి ఈడకొచ్చా. కారుడులసుమంటివి నాకేడవి. లేవ్. దేవున్ని లెక్కన అగుబడ్డావ్. పాపం పిచ్చిముండ పొద్దుగాల్నుంచి యాస్తు పడ్తోంది. దాని పేనం కాపాడు బిడ్డా. నీ కాల్మొక్కుతా.’ అన్నాది. ఆ మాటలకి బిత్తరపోయిన నేను ఎంటనే లోపలికురికాను. అక్కడ స్ట్రెచర్లేదు, అమ్మాయి నేదు. నర్సమ్మ కన్వడితే, “నర్సమ్మా.. ఆ అమ్మాయి?” నా గొంతు పెగల్లా.
‘చచ్చి పోయింది. ఆమె బాడీ బయటుంది. ఇదిగో ఈ పసిగుడ్డు ఆమెకు పుట్టింది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆళ్ళను తీసుకుపోవాలి. ఆ గదికి పో. అక్కడ మా వాళ్ళుంటారు’ అంది. గొంతులో దుక్కం. గుండెల్లో గుబులు. ఆ గది దిక్కెల్లాను. ఆల్లు అయిదేలడిగేరు బిడ్డను తల్లిని అప్పసెప్పడానికి. అంత సొమ్ము నాకాడ యాడుంది. ఇరవైయేళ్ళ ఈ ఆడమనిషి ఎవరికి పుట్టిందో, ఇక్కడో పసిగుడ్డుకి జన్మనిచ్చి తనమానాన తను తరిలిపోయింది. ఋణానుబంధమంటే ఇదేనా? ఏ సంబంధంలేని తనకు తెంపుకోలేని బంధమై చుట్టుకుంది. యాడేడనో దేవుల్లాడి. దోస్తుల సాయంతో పోగుసేసిన ఐదేలిచ్చి పసిగుడ్డును తీసుకున్నా. చూడు టీచరమ్మ ఆడొ ముసల్ది సంబురాల్ని సూస్తా ఉండింది అది మాయమ్మ...! ఆరోజున ఈ పసిగుడ్డుని...అదేనమ్మ రత్నాన్ని ఇంటికి తోడ్కోనొచ్చి నా పెండ్లాం సేతిలో పెట్టి జరిగిందంతా సెప్పా. ఆపుడీ ముసిల్ది ఏమందో తెల్సా, ‘‘ఒరి యాదిగా! నీకు పిల్లలు లేనంత మాత్రానా తల్లిని సంపి పుట్టిన ఇసుమంటి ముదనట్టపు పిల్లను తెస్సుకో కూడదరా. ఇదింకా ఎన్ని అనర్దాలు తెస్సిపెడుతుందో నీకు తెలీదు. నా మాటిని ఏడనుండి తెస్సినావో ఆడనే ఇడిసిరా. పో...’’ అంది. ఇంకా కళ్ళు కూడా ఇడవని అనాధ పసిగుడ్డు ముదనట్టప్పిల్ల ఎట్టవుతుందని నేను, నా పెండ్లాం మా యమ్మ మాటినలేదు. కానీ, ఆ బాంబు పేలుళ్ళలో నా పెండ్లాం సనిపోయినపుడు ఇది ముదనట్టపుపిల్లే ననుకున్నానమ్మా. అసుమంటిది ఇయ్యాల రత్న కలకటేరయ్యిందని సంతోసిన్చలా, లేక ఆమెను కన్నతల్లి గాని, పెంచిన తల్లీ గాని లేదని దిగాలు పడాలో తెల్వటలేదమ్మా. ’ అని తన జీవితంలో జరిగిన కథ అంతా యాదగిరి చెప్పాడు. ‘నీకెటువంటి సంబంధం లేని ఓ అనాధబిడ్డను పెంచి ఇంత గొప్పదాన్ని చేసావు. ఈ బంధాన్ని ఏమంటారో నాకైతే తెలీదు.’ ఆశ్చర్యంగా అంది మాధురి. ‘ఈ పిల్ల వల్లనే నా పెండ్లాం సనిపోయిందని మా యమ్మ సెప్పినపుడు సత్తెమనిపించి దీన్ని ఇడిసిపెట్టాలనుకున్నా. కానీ, మెడకు సుట్టుకున్న బంధం కాల్ల కడ్డుపడి నన్నాపని సేయ్యనీలేదమ్మ. పేగులు కలవకపోయినా బందం కలిసిందమ్మా. అది తెంపుకోలేని బంధమేనమ్మా! పెంచుకున్న బిడ్డ రత్నమై. మా కంటిదీపమై, కలకటేరై బస్తీకే ఎలుగైంది. అసుమంటప్పుడు కల్లమట్ట నీరు రాకమానదమ్మ ?’ యాదగిరి గొంతు దుఃఖాతిశయంతో వణికింది. తెంపుకోలేని మానవతా బంధానికి తెరచాపలా నిలిచిన యాదగిరి ఔన్నత్యానికి చేతులు జోడించి నమస్కరించింది మాధురి.
మోచర్ల అనంత పద్మనాభరావు
98486 07127








కామెంట్‌లు (0)