mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బండి భగీరథ్‌ అరెస్ట్‌

16 మే, 2026

bandi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 01:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పేట్‌ ‌బషీరాబాద్‌ స్టేషన్‌‌కు నిందితుడి తరలింపు, విచారణ

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ‌శివారు నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్‌ ‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌‌కు తరలించి పోక్సో కేసుకు సంబంధించి విచారించారు. భగీరథ్‌‌ అరెస్ట్‌లో జాప్యాన్ని తప్పుబడుతూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా శనివారం పోలీసులు లుక్‌ అవుట్‌ ‌నోటీసులు జారీ చేశారు. నిందితుడితో టచ్‌లో ఉన్న వారిపై, స్నేహితులు, బంధువుల ఇళ్లపై నిఘా ఉంచారు. బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ ఇంట్లో ఒక బృందం తనిఖీలు నిర్వహించింది. ముందస్తు బెయిల్‌ ‌పిటిషన్‌‌పై తీర్పు ఆలస్యమవుతుండటంతోపాటు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి పెరుగుతుండటంతో భగీరథ్‌ ‌తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఇరకాటంలో పడ్డారు. కాగా, ఈ కేసులో బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను మేడ్చల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట 40 నిమిషాల పాటు పోలీసులు రికార్డు చేశారు.

బెయిల్‌ ‌వస్తుందనే వెయిట్‌ ‌చేశాం : బండి సంజయ్‌ ​

తన కుమారుడికి బెయిల్‌ ‌వస్తుందని ఇంతవరకూ వెయిట్‌ ‌చేశామని బండి సంజయ్‌ ఓ ప్రకటన‌లో పేర్కొన్నారు. భగీరథ్‌ అరెస్టు అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వాస్తవానికి ఫిర్యాదు రాగానే పోలీస్‌ ‌స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నా. బెయిల్‌ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. ఇంకా కేసులో జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో మా అబ్బాయిని లాయర్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించాను. న్యాయవ్యవస్థపై నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వాస్తవానికి కోర్టు ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉంది’ అని ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కాగా, నిందితుడు భగీరథ్‌ను తామే లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించామని బండి సంజయ్‌ ప్రకటించగా… భగీరథ్‌‌ను పోలీసులు నార్సింగిలో అరెస్ట్‌ చేసినట్టు సైబరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌రమేష్‌ ‌రెడ్డి చెప్పడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్