- మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో దశాబ్ద కాలం కిందట 2015లో 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవగా, మళ్లీ అంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈ వేసవిలో నమోదవుతుండటంతో ప్రజలు వేసవి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 48.3 డిగ్రీలు ఆదివారం నమోదైంది. గత వారంలో అత్యధికంగా 48.1 డిగ్రీలు నమోదు కాగా, ఆదివారం 48.3 డిగ్రీలకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో ఈ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, తూర్పు గోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా, 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఏలూరు 23 మండలాలు, తూర్పుగోదావరి 21, పశ్చిమగోదావరి 17, కృష్ణా 16, బాపట్ల 15, ఎన్‌టిఆర్ 14, పల్నాడు 13, కోనసీమ 12, కాకినాడ 11 మండలాల్లో ఎండ ఉధృతి అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా వడదెబ్బతో మరణాలు నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు కూడా వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కపోత, వేడి, ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. అధిక సంఖ్యలో ఎసిల వినియోగం వల్ల విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరింది.
నేటి నుంచి రోహిణీ కార్తె
వేసవి కాలానికి కీలకమైన రోహిణీ కార్తె ఈ నెల 25 నుంచి ప్రారంభం కావ డంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తు న్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు నమోదవుతాయని నానుడి ప్రచా రంలో ఉంది. ఈ కార్తె ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకూ కొనసాగు తుంది. ఈ కార్తెలో మొదటి 5 రోజులు ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుం దని అంచనా వేస్తున్నారు. మరోవైపు విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది.
నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు
రాష్ట్రంలో సోమవారం నాడు 29 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు,166 మండలాల్లో వడగాడ్పులు, మంగళవారం నాడు 50 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 205 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అక్కడక్కడ వర్షాలు
ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.









కామెంట్‌లు (0)