శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాధ్యతారాహిత్యం!

2 గంటల క్రితం

AMITSHAH
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 05:56 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు దమనకాండకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ బాధ్యతను విస్మరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పార్లమెంటులో నిలదీతను ఎదుర్కోవాల్సిన సందర్భంలో సభలో వివరణ ఇవ్వకుండా బయట మీడియాతో బీరాలు పలకడం బాధ్యతారాహిత్యం! ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి బదులు ప్రతిపక్షాలే చర్చకు సహకరించాలంటూ షరతులు విధించడం హాస్యాస్పదం. జులై 20న విద్యార్థులు పార్లమెంటు వైపు కదిలిన సందర్భంలో పోలీసులు అమానుషంగా విరుచుకుపడటం, రక్తమోడేలా లాఠీచార్జి చేయడం, పెల్లెట్‌ గన్లు ఉపయోగించడం, అమ్మాయిల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించటం వంటి దుశ్చర్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. పెల్లెట్ల వినియోగానికి సంబంధించి పోలీసు డైరీలో ఆధారాలు బయటపడిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పష్టత అవసరమైంది. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున... పోలీసులు తీసుకున్న ప్రతి చర్యకూ కేంద్ర హోంమంత్రిదే బాధ్యత. జరిగిన దానికి కారణం చెప్పి క్షమాపణ కోరాల్సిన తరుణంలో అమిత్‌ షా సమావేశాలకే గైర్హాజరు కావటం గర్హనీయం. పైగా, ప్రతిపక్షం ప్రశ్నించడమే నేరమూ ఘోరమూ అన్నట్టుగా మోడీ ప్రభుత్వం ఎదురుదాడికి దిగటం ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఉంది. అయినా ప్రతిపక్షాలు గట్టిగా నిలదీయడంతో అధికార పక్షం ఇరుకునపడింది.

భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని, పార్లమెంటరీ విలువలను బిజెపి హయాంలో ఎంతగా దిగజారిపోయాయో గణాంకాలు, సభా సందర్భాలే సాక్ష్యం. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు వేదికగా నిలవాల్సిన చట్టసభలకు బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకుండా, సంఖ్యాబలంతోనే బిల్లులను నెగ్గించుకుంటూ వస్తోంది. పార్లమెంటులో చర్చ, పరిశీలన, జవాబుదారీతనం అనే మూడు మూల స్తంభాల స్థానంలో సంఖ్యాబలం, దారిమళ్లింపు, రాజకీయ ఎదురుదాడి వ్యూహాలతో సభా సంప్రదాయాలకు నిలువుపాతర వేస్తోంది. 2020లో కరోనా కాలంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న డిమాండ్‌, తీవ్ర అభ్యంతరాలు, రైతు సంఘాల ఆందోళనలు ఉన్నప్పటికీ ఆమోదించారు. అనంతరం సాగిన రైతు ఉద్యమం నేపథ్యంలో 2021 నవంబర్‌లో ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కార్మిక చట్టాలను సమగ్రంగా మార్చే మూడు లేబర్‌ కోడ్లను అభ్యంతరాలను లెక్కచేయకుండానే తీసుకొచ్చారు. మణిపూర్‌ హింస విషయంలో ప్రధానమంత్రి పార్లమెంటులో సమాధానం చెప్పటానికే ససేమిరా ఇష్టపడలేదు. 2023 డిసెంబర్‌లో పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై హోంమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తే - ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. దేశ క్రిమినల్‌ న్యాయవ్యవస్థను మార్చే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను ప్రతిపక్ష సభ్యులు లేకుండానే ఆమోదించేశారు. ప్రజాస్వామ్యాన్ని ఇలా పరిహసించటమే ఘనమైన వ్యూహంగా బిజెపి ప్రవర్తిస్తూ వస్తోంది.

దేశాన్ని నిర్దేశించే నిర్ణయాల్లో పార్లమెంటరీ కమిటీల పాత్రను తగ్గించేయటం మరొక ప్రమాదకరమైన పోకడ. 15వ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో 71 శాతం కమిటీల పరిశీలనకు వెళ్లగా, 16వ లోక్‌సభలో అది 25 శాతానికి, 17వ లోక్‌సభలో 16 శాతానికి పడిపోయింది. అంటే 15వ లోక్‌సభతో పోలిస్తే 17వ లోక్‌సభలో కమిటీ పరిశీలనకు వెళ్లిన బిల్లుల వాటా 55 శాతం మేర తగ్గింది. 17వ లోక్‌సభలో ఆమోదమైన 179 బిల్లుల్లో 35 శాతం గంటలోపే చర్చతో ఆమోదమయ్యాయి; 58 శాతం బిల్లులు ప్రవేశపెట్టిన రెండు వారాల్లోపే ఆమోదం పొందాయి. జమ్ము కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్‌ వంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టిన రెండు రోజుల్లోనే ఆమోదం పొందాయి. కొన్ని బిల్లులు నాలుగైదు నిమిషాల చర్చతోనే ఆమోదం పొందాయి. పార్లమెంటరీ ప్రక్రియల్ని నిర్వీర్యం చేయడం నయా ఫాసిస్టు ధోరణుల్లో ముఖ్యమైనది.

ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో ఎదురుదాడికి దిగితే, బిల్లులపై అభ్యంతరాలను వినాల్సిన చోట అడ్డగోలుగా నెగ్గించుకుంటే ఇక చట్టసభలు ఎందుకు? చట్టసభల్లో తగిన చర్చ జరగకపోతే, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రతిస్పందించకపోతే ప్రజలు వీధుల్లోకి వస్తారు. మూడు నల్లచట్టాలపై రైతుల మహోద్యమం, కార్మిక చట్టాల్లో హక్కులను హరించి కార్పొరేట్లకు అనుకూలంగా మార్చటంపై కార్మికుల దేశవ్యాప్త ఆందోళనలు, పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఉద్యమం... పాలక పక్షం నిరంకుశ విధానాలకు ప్రతిస్పందనలే! వాటిని కూడా వినకుండా బలప్రయోగంతో అణచివేసే నిరంకుశాన్ని మోడీ ప్రభుత్వం చేపడుతోంది. దేశద్రోహులు, ఉగ్రవాదులు, విచ్ఛిన్నకారులు అంటూ ఉద్యమించేవారిని అవమానించే పాచిపోయిన దిగజారుడు వ్యూహాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఈ వ్యూహాల వెనుక ఉన్న డొల్లతనం ఏమిటో దేశం అర్థం చేసుకోవటం మొదలైంది. కాబట్టే మోడీ - షా ద్వయానికి పార్లమెంటుకు భయపడే స్థితి ఉత్పన్నమైంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రభుత్వం అంటే ప్రతిపక్షంపై దాడి చేసే ప్రభుత్వం కాదు; ప్రతిపక్షం అడిగే కఠినమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలిగే ప్రభుత్వం. జంతర్‌ మంతర్‌ ఘటనపై బాధ్యతాయుతంగా సమాధానం చెప్పటం అమిత్‌ షా విధి. దాన్నుంచి తప్పించుకోవడం ద్వారా బిజెపి ప్రభుత్వపు నిరంకుశ ధోరణే కాదు, పిరికితనం కూడా దేశానికి తెలిసొచ్చింది!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్