1947లో నాటిన స్వాతంత్ర్యం అనే వృక్షానికి 80 సంవత్సరాలు వచ్చాయి. అసమాన త్యాగాల ఎరువుతో, భవిష్యత్ ఆశల నీటితో, రాజ్యాంగ సాగుభూమిలో, స్వావలంబన చట్టాల రక్షణ కంచెల్లో నాటుకున్న మొక్క ఇది. మతతత్వం, కులవివక్ష, సాంఘిక అణచివేత లాంటి చీడపురుగులు, సామ్రాజ్యవాద మిడతలదండు ఈ మొక్కను నులిపేయకుండా ‘భారతీయులమైన మేము’ అంటూ శపథం చేశాము, చేస్తున్నాము. అలాంటి స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాయా? అంటే ‘లేదు’ అనే సమాధానానికి కాపలాదారులే జవాబు చెప్పాలి. ఉమ్మడి కృషి వల్ల సాగిన స్వాతంత్ర్య క్షీరసాగర మధన అమృతం కొందరికీ, హాలాహలం అత్యధికులకు అనే కాలం ఎల్లకాలం సాగదని కొత్త గొంతుకలు నినదిస్తున్నాయి. కార్మిక, కర్షకుల మధ్య పెరుగుతున్న ఐక్యత, నవతరం స్పందిస్తున్న తీరు కొత్త ఆకులను చిగురింపచేస్తున్నాయి.
కేవలం 300 కుటుంబాల చేతుల్లో రూ.138 లక్షల కోట్లు వున్నాయని ‘హురున్ ఇండియా’ తాజా నివేదిక ప్రకటించింది. నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలండ్ దేశాల జిడిపి కంటే ఇది అధికమని ఈ రిపోర్టు పేర్కొంది. మన రాష్ట్ర జిడిపి (రూ. 17.62 లక్షల కోట్లు) కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. గడిచిన రెండేళ్ల కాలంలో వీరి సంపద విలువ సుమారు రూ.30 లక్షల కోట్లు (27.5 శాతం) పెరిగింది. అంటే, సగటున రోజుకు రూ.4,076 కోట్లు పోగేసుకున్నాయి. దీనిని సంపద సృష్టిగా సంపన్నుల మీడియా కీర్తించడం అసలు విషయం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడమే. మరోవైపు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, ఐదేళ్లలోపు భారతీయ పిల్లలలో 36.5 శాతం మంది ఎదుగుదల లోపంతో, 19.3 శాతం మంది బక్కచిక్కిపోయి, 32.1 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2025 ప్రపంచ ఆకలి సూచిక లెక్కల ప్రకారం 123 దేశాలలో భారతదేశం 25.8 స్కోరుతో 102వ స్థానంలో ఉంది. దేశ జనాభాలో 12 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో అత్యధికులు మహిళలు. సరైన ఆహారం లేక ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. 300 మంది 138 లక్షల కోట్ల సంపదతో తులతూగుతుంటే, మూడింట ఒక వంతు మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.
స్వాతంత్ర్య ఫలాలను సమానంగా పంచాల్సిన కాపలాదారులు ఏకపక్షంగా సంపన్నులు పెరగడానికి అవసరమైన విధానాలను రూపొందించారు. దేశం అభివృద్ధి కావాలంటే జాతీయ పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి కావాలనే కాంగ్రెస్ అవగాహన వీరికి అనేక రూపాల్లో రాయితీలు ఇచ్చేలా చేసింది. ప్రభుత్వరంగంలోని కీలక పరిశ్రమలను ఉపయోగించుకుని లాభపడిన వీరు ఏకంగా ఆ పరిశ్రమలనే కబళించే శక్తివంతులుగా మారారు. అందుకు తగ్గట్టుగా పాలకవర్గాలచేత నూతన విధానాలను అమలు చేయించారు. ఈ విధానాలను సంప్రదాయక కాంగ్రెస్ కంటే, బిజెపి వేగంగా అమలు చేయగలదని గుర్తించి వారి పంచన చేరారు. వారి అంచనాకు తగ్గట్టుగానే ఈ 12 సంవత్సరాల పాలన సాగింది.
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపన్నుల సంఖ్య భారీగా పెరిగింది. రూ.ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ సంపద వున్నవారు 2014లో 122 మంది వుంటే 2025 నాటికి 581 మందిగా పెరిగారు. వీరుగాక 1,682 మంది వద్ద రూ.వెయ్యికోట్లకు పైగా సంపద వుంటే, 1600 నుండి రూ.1800 కోట్ల సంపద 2,531 మంది దగ్గర వుంది. ఆశ్చర్యకరంగా కరోనా మహమ్మారి కాలంలో సైతం ఈ కుబేరుల పెరుగుదల ఆగలేదు. రూ.25.82 లక్షల కోట్ల ఆస్తితో ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తొలితరం పారిశ్రామికవేత్తల్లో వేగంగా పెరిగిన గౌతం అదానీ రూ.19.6 లక్షల కోట్లకు యజమాని అయ్యారు. గుజరాత్‌కు చెందిన ఈ రెండు కార్పొరేట్ కుటుంబాలు మోడీ పాలనాకాలంలో వర్ధిల్లితున్నాయి. రూ.8.14 లక్షల కోట్లతో కుమార మంగళం బిర్లా, రూ.8.02 లక్షల కోట్లతో జిందాల్, రూ.7.7 లక్షల కోట్లతో బజాజ్ కుటుంబం, రూ.5.5 లక్షల కోట్లతో మహీంద్రా కుటుంబాలు బలపడ్డాయి. మైనింగ్ రాజుగా పిలవబడుతున్న అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ విలువ 75 శాతం పెరిగి రూ.4.45 లక్షల కోట్లకు చేరింది. అలాగే ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ భారతీ మిట్టల్, సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పూనావాలా, డీమార్ట్ సూపర్ మార్కెట్ల అధిపతి రాధాకిషన్ దమానీ ఇలా ఈ కుబేరుల జాబితా ఇంతింతై వటుడింతైన చందంలా తయారైంది.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేందుకు జి.వి. రామకృష్ణన్ కమిషన్ మార్కెట్ ధరకు కాకుండా బుక్ వాల్యూ (ఈ స్థలం మొదటి ధర)కు అమ్మేలా సిఫారసు చేయించుకున్నారు. నౌకాశ్రయాలు, విమానశ్రయాలు, రైల్వే, రోడ్డు మార్గాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికమ్యూనికేషన్స్, బాల్కో ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ అతి చౌకగా ఈ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయి. రైతుల చేతుల్లో వుండాల్సిన భూమి ఈ కంపెనీల చేతుల్లో పెద్ద ఎత్తున పోగుబడుతున్నది. ఒక్క గుజరాత్‌లోనే గౌతం అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీకి 1,32,000 ఎకరాలు, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రాజెక్టుకు 5.5 లక్షల ఎకరాల భూమిని బిజెపి పాలకులు ధారాదత్తం చేశారు. అదానీ కంపెనీకి బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలో ఎకరం భూమి ఒక్క రూపాయి లీజుతో 1020 ఎకరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మన రాష్ట్రంలో భూముల అప్పగింతతోపాటు పిపిపి పేరుతో అన్ని ప్రభుత్వ సేవారంగాలను ప్రైవేట్‌వారి పరం చేస్తున్నారు. ఇలా గాలివాటంగా వచ్చిన సంపద నుండి కొంత మొత్తాన్ని తిరిగి రాజకీయ పార్టీలకు ముఖ్యంగా బిజెపి కి ఎన్నికల బాండ్ల రూపంలో ఈ కంపెనీలు ఇస్తున్నాయి. ఈ ఉభయతారక విధానం వల్ల దేశం అప్పుల్లో కూరకుపోతుంటే కొందరు వ్యక్తులు అత్యంత వేగంగా సంపన్నులు అవుతున్నారు. కోట్ల మంది ప్రజలకు ఇచ్చే సబ్సిడీ పథకాలకు నిధులు లేవని, ఉచిత పథకాలు అర్థంలేనివని ఈ సంపన్నులు, వారు నిర్వహిస్తున్న మీడియా సంస్థలు, వీరికి మద్దతుగా వున్న మేధావులు అనబడే వారే ప్రచారం చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉంది.
ప్రభుత్వ విధానాల వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాలను ప్రశ్నించడం ఇటీవల పెరిగింది. తమ సొంత అనుభవం నుండి నేర్చుకున్న అంశాలను యువతరం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ నాడు జాతీయోద్యమంలో విద్యావంతులు బ్రిటీష్ విధానాలను ప్రశ్నించారు. ప్రశ్నను సహించలేని పాలకులు కాలేజీలనుండి బహిష్కరించారు. దేశద్రోహం లాంటి తప్పుడు కేసులు పెట్టి ఎలాంటి విచారణ చేయకుండా సంవత్సరాల కొద్దీ జైళ్లల్లో పెట్టారు. విద్యాలయాలపై కక్ష కట్టారు. వాటికి నిధులు ఆపేశారు. కొత్త కొత్త విధానాలు తెచ్చి యువత గొంతు నొక్కడానికి ప్రయత్నించారు. అదే పద్ధతులను నేడు ఈ స్వదేశీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇప్పుడు అడగాల్సింది ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి? మాకు ఉద్యోగాలు ఎందుకు లేవు? కనీస వేతనం ఎందుకు అమలు చేయడంలేదు? లింగ, సామాజిక వివక్ష ఎందుకు? అని మాత్రమే కాదు. నవ్వుతూ ఉరికంబాలు ఎక్కిన యువ కిశోరాలు, వివస్త్రలుగా నిలచినా జాతీయ పతాకాన్ని నేలకు దించని వీరవనితలు, లాఠీలకు, తుపాకులకు ఎదురేగిన కార్మిక, కర్షకులు నాటిన స్వాతంత్ర్య ఫలాలు మాకు ఎందుకు దక్కలేదని న్యాయమైన వాటా కోసం నూతన మార్గంలో మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలి.
- వి. రాంభూపాల్







కామెంట్‌లు (0)