- సర్పంచ్ స్థానాలకు 25,413, వార్డులకు 1,09,178 మంది అర్హత
ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం 1,34,591 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వీరిలో సర్పంచ్ స్థానాలకు 25,413 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,09,178 మంది పోటీలో నిలిచారని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లోని 52 డివిజన్లలో 246 మండలాల పరిధిలో 4,975 సర్పంచ్, 49,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం జిల్లాలో రెండో విడత ఎన్నికలు లేవు.
మూడో విడత మొదటి రోజు 18,545 నామినేషన్లు
రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ఊపందుకుంది. శనివారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 18,545 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ స్థానాలకు 4,930, వార్డు సభ్యుల స్థానాలకు 13,615 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 46 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 214 మండలాల్లో 4,244 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తిరుపతి జిల్లాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగడం లేదు.








కామెంట్‌లు (0)