- ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
- రాష్ట్ర పర్యటనలో కేంద్ర బృందాలు గుర్తింపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అల్లూరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టీనేజ్ గర్భధారణలు సుమారు 10 శాతం వరకు ఉన్నట్లు కేంద్ర వైద్య బృందం గుర్తించింది. ఈ గర్భధారణలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్, పరిశీలకులు దీపక్ సోనీ పర్యవేక్షణలో, జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం సలహాదారు మోనా గుప్తా నేతృత్వంలో రెండు వైద్య బృందాలు పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించాయి. పర్యటనలో గుర్తించిన అంశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కెవిఎన్ చక్రధర్బాబులకు శుక్రవారం ఈ బృందాలు వివరించాయి. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది.
పాడేరు ఆసుపత్రిలో తల్లీబిడ్డలకు అవసరమైన వైద్య సేవలను నూతన భవనం ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కుటుంబ నియంత్రణపై గర్భిణులకు, ప్రసవం తర్వాత తల్లులకు అవగాహన కల్పించాలని తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు వసతి కల్పించాలని, వైద్య సేవల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసే విధానాన్ని సులభతరం చేయాలని తెలిపింది. అరకులోయ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత తల్లులు ఉండే గదిలో తగినంత గోప్యత ఉండటం లేదని కేంద్ర బృందం గుర్తించింది. ప్రసవ గదుల్లో పనిచేసే నర్సులకు అవసరమైన శిక్షణ లేదని, గర్భిణులకు జననీ సురక్ష పథకంపై అవగాహన తక్కువగా ఉందని పేర్కొంది. తణుకు ఆసుపత్రిలో నవజాత శిశువుల ప్రత్యేక చికిత్సా విభాగంలో అందుబాటులో ఉన్న పడకల కంటే ఎక్కువ మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని తెలిపింది. అల్లూరి జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి చిన్నారులను ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక వాహనం ఒకటే ఉందని పేర్కొంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కౌమార బాలబాలికల ఆరోగ్య కార్యక్రమాలు అమలు కావడం లేదని పేర్కొంది. క్షయ వ్యాధిగ్రస్తులకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాకుండా ఏరియా ఆసుపత్రుల్లో మందులు అందిస్తుండటంతో, వారు క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారో లేదో తెలుసుకోవడం కష్టమవుతోందని పేర్కొంది.పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద చేయాల్సిన చెల్లింపులు చేయకుండా నిధులను వెనక్కి పంపించారని గుర్తించింది.వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, యాప్‌లలో వివరాల నమోదు, ఇందుకు పడుతున్న సమయాన్ని సమీక్షించాలని కేంద్ర బృందం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర శిక్షణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది.కేంద్ర వైద్య బృందాలు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కార్యదర్శి వీరపాండియన్, కమిషనర్ కెవిఎన్ చక్రధర్‌బాబు చెప్పారు.








కామెంట్లు (0)