ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపిఎస్‌ఆర్‌టిసిలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎపిపిటిడి (ఆర్‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి రాష్ట్ర కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్‌టిసిలోనూ నియామకాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ, ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్‌టిసి సిబ్బంది సేవలందిస్తున్నారని తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తోన్న ఉద్యోగులపై అదనపు పని భారం పడుతోందని పేర్కొన్నారు. ఆర్‌టిసిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ సిబ్బందితో పాటు వివిధ కేటగిరీల్లో సుమారు 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలంటే అవసరమైన సిబ్బంది నియామకాలు అత్యవసరమని పేర్కొన్నారు.
15 వేల ఖాళీలు భర్తీ చేయాలి : ఆర్‌టిసి జెఎసి
19 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)