- 11 వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసి అనుమతులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో (2026–27) విద్యా సంవత్సరానికి 161 కొత్త పిజి వైద్య సీట్లను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసి) మంజూరు చేసింది. మొత్తం 15 స్పెషాలిటీల్లో ఈ సీట్లు వచ్చాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి 163 సీట్లకు ప్రతిపాదనలు పంపగా ఎన్‌ఎంసి 161 సీట్ల (98.77 శాతం)కు అనుమతించింది. ఎన్ఎంసి మార్గదర్శకాలకు అనుగుణంగా 11 కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకాలు, పడకల పెంపు, వైద్య పరికరాలు, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించడం ద్వారా ఈ సీట్లు అదనంగా వచ్చాయి. వైద్య విభాగాల వారీ ఆర్థోపెడిక్స్‌లో అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. చర్మ, సుఖ వ్యాధుల విభాగం, ఇఎన్‌టి, పాథాలజీ విభాగాల్లో 16 చొప్పున, రేడియో డయాగ్నోసిస్ 14, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాల్లో 12 చొప్పున, జనరల్ మెడిసిన్, అనస్థీషియాలజీ, ఆప్తాల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాల్లో 8 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూతి, గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో 4 చొప్పున సీట్లు లభించాయి. ఎమర్జెన్సీ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో మంజూరైన సీట్లు అత్యవసర చికిత్స, శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఆరోగ్యం, కేన్సర్ చికిత్స వంటి ప్రాధాన్య రంగాల్లో వైద్య నిపుణుల సంఖ్యను పెంచనున్నాయి. ప్రస్తుతం మంజూరైన 161 సీట్లను 2026–27 విద్యా సంవత్సర పిజి ప్రవేశాల కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వైద్య విద్య డైరెక్టరు విష్ణువర్ధన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది 13 ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి 150 పిజి వైద్య విద్య సీట్ల మంజూరుకు దరఖాస్తులు వెళ్లగా ఎన్ఎంసి 142 సీట్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)