అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన షెడ్యూల్ విడుదల : సిపి
ప్రజాశక్తి-విజయవాడ
ఎన్‌టిఆర్ జిల్లా పరిధిలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు, నామినీలు, ఏజెంట్ల వద్ద ఉన్న ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన కార్యక్రమాన్ని మండలాల వారీగా నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పెనుగంచిప్రోలు మండలంలో ఈ నెల 9 నుండి 16 వరకు, వత్సవాయిలో 17 నుండి 30వ తేదీ వరకు బాండ్లను పరిశీలిస్తారన్నారు. నందిగామలో డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు, ఇబ్రహీంపట్నంలో 17 నుండి 31 వరకు బాండ్ల పరిశీలన ఉంటుందన్నారు. జగ్గయ్యపేట మండలంలో వచ్చే ఏడాది జనవరి 1 నుండి 17వ తేదీ వరకు, విజయవాడ రూరల్ మండలంలో అదే నెల 18 నుండి 31 వరకు పరిశీలిస్తారన్నారు. విజయవాడ అర్బన్ మండలంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు బాండ్ల పరిశీలన జరుగుతుందని వెల్లడించారు. బాండ్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయం (పెనమలూరు మండలం కానూరు 3వ రోడ్డు, తులసి నగర్, రియా ఆర్థోపెడిక్ ఆసుపత్రి సమీపంలో) వద్ద పరిశీలిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలలో పరిశీలన ఉండదన్నారు. బాధితులు తమ తమ మండలాలకు కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ అగ్రిగోల్డ్ బాండ్లతో పాటు సంబంధిత గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకువచ్చి పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సీపీ సూచించారు.







కామెంట్‌లు (0)