రాంఛి : జార్ఖండ్‌లో గిరిజన హక్కుల కార్యకర్తగా చెప్పుకుంటున్న నిషా భగత్ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం శుక్రవారం నాడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బలవన్మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో ఆమె లైవ్ ద్వారా అందుకు దారితీసిన కారణాలను తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లగా..అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడివున్నారు. దీంతో ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికంగా ఆమెకు సంఘ్ పరివార్, బిజెపి కార్యకర్తగా పేరుంది. సర్ణా ఆదివాసీల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తింపు ఉంది. అయితే తాను ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యకర్తను కాదని, జార్ఖండ్ కార్యకర్తనని ఆమె తన లైవ్ వీడియోలో చెప్పుకున్నారు. 11 నిమిషాల నిడివి ఉన్న సదరు వీడియోలో ఆమె అనేక విషయాలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన అనుచరులుగా ఉన్న భూమాఫియా నుంచి వేధింపులు ఎదరౌతున్నాయని తెలిపారు. నిషా మృతిపట్ల బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మురాండీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తక్షణమే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో భూమాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)