ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
అందరి జీవితాల్లో వెలుగులు నింపుకునే విధంగా దీపావళి పండగను వైభవంగా జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అయితే పిల్లలు సరదాగా టపాసులు కాల్చే వేళ గతంలో ఎన్నోసార్లు అపశృతులు చోటు చేసుకున్నాయి. అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటే పండగను ఆనందోత్సాహాలతో చేసుకోవచ్చని గుడ్లవల్లేరు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణురాలు డాక్టర్ మంజూష రెల్లా తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు కంటి రక్షణ కోసం తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గాగుల్స్ (సేఫ్టీ గ్లాసెస్) ధరించాలని, సాధారణ కళ్లద్దాలు కంటికి పూర్తి స్థాయి రక్షణ కల్పించలేవు కాబట్టి బాణసంచా కాల్చే సమయంలో ప్రభావ నిరోధకత కలిగిన సేఫ్టీ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా బాణసంచా కాల్చనివ్వకూడదని, బాణసంచా కాల్చే ప్రదేశంలో తప్పనిసరిగా నీటి బకెట్ లేదా ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. చేతిలో పట్టుకుని బాణసంచా కాల్చకూడదని, టపాసులను నేలపై ఉంచి, సురక్షితమైన దూరం నుంచి వెలిగించాలన్నారు. పేలని టపాసులను మళ్లీ వెలిగించడానికి ప్రయత్నించకూడదని, పొగ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని వివరించారు. టపాసుల నుంచి వెలువడే నిప్పురవ్వలు కళ్లలో పడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. కంటికి గాయం అయినప్పుడు కంటిని నలపకూడదు, రుద్దకూడదని, సకాలంలో వైద్యం పొందాలని వివరించారు.








కామెంట్‌లు (0)