శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

6 నెలల్లో మరో 4,400 'ఆయుష్మాన్' కేంద్రాలు

06 అక్టోబర్, 2026

yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 06:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి సత్యకుమార్

గుడివాడ: రాష్ట్ర గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఒకేసారి 24 జిల్లాల్లో 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవనాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లోని జనార్దనపురం గ్రామంలో నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మరో 266 నూతన భవనాలను మంత్రి వర్చువల్‌గా ఏకకాలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామం నుంచి పట్టణానికి వెళ్లి వైద్యం పొందాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలను నేరుగా గ్రామానికే తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నూతనంగా ప్రారంభించిన 267 ఆరోగ్య భవనాల నిర్మాణానికి సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 267 నూతన ఆరోగ్య భవనాలను ప్రారంభించడం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిందన్నారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రంలో మిగిలిన 4,400 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నూతన భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాల నూతన భవనాలను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. మిగిలిన భవనాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణ పనులు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసి, ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తదుపరి దశలో పూర్తయ్యే ఆరోగ్య కేంద్రాల ప్రారంభ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్