ప్రజాశక్తి - విశాఖ : భారత్–మయన్మార్ దేశాల మధ్య సముద్ర భద్రత, పరస్పర సహకారం, కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన 8వ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు విశాఖపట్నం వేదికగా ఈ నెల 14వ తేదీన విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో విన్యాసాల నిర్వహణపై నావీ అధికారులు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నౌకాదళాలు చురుకుగా పాల్గొని సముద్ర కార్యకలాపాల్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి. విన్యాసాల్లో భాగంగా బంగాళాఖాతంలో నిర్వహించిన సముద్ర దశలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ రాణా, ఐఎన్‌ఎస్ సుమేధ యుద్ధ నౌకలతోపాటు మయన్మార్ నౌకాదళానికి చెందిన యుఎంఎస్ కింగ్ సిన్ ఫ్యూ షిన్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల నౌకాదళాలు వివిధ సముద్ర విన్యాసాలు, సంయుక్త శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాయి. వీటి ద్వారా సముద్రంలో సమన్వయంతో పనిచేయడం, పరస్పర కార్యాచరణ విధానాలను అర్థం చేసుకోవడం, సముద్ర కార్యకలాపాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాయి. విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన హార్బర్ దశలో ఇరు దేశాల నౌకాదళ సిబ్బంది మధ్య పలు వృత్తిపరమైన కార్యక్రమాలు జరిగాయి. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ ఎక్స్ఛేంజెస్ ద్వారా నౌకాదళ కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకున్నారు. క్రాస్ డెక్ సందర్శనల ద్వారా ఇరు దేశాల యుద్ధ నౌకల పనితీరు, నిర్వహణ విధానాలు, కార్యాచరణ వ్యవస్థలను తెలుసుకునే అవకాశం కల్పించారు. సముద్ర భద్రతకు సంబంధించిన ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడనున్నాయి. భారతదేశం అనుసరిస్తున్న మహాసాగర్ విజన్, నైబర్‌హుడ్ ఫస్ట్ విధానాలకు అనుగుణంగా ఈ విన్యాసాలు నిర్వహించారు. పొరుగు దేశాలతో రక్షణ రంగ సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సముద్ర భద్రతకు పరస్పర సహకారం అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ఈ విన్యాసాలు నిర్వహించినట్లు నావీ అధికారులు తెలిపారు.










కామెంట్‌లు (0)