కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన ఐదు మృతదేహాలు
మరో నలుగురి కోసం గాలింపు
వీరంతా తమిళనాడుకు చెందిన వారు
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో, కొత్తపట్నం : మురసు తుపానులో చిక్కుకొని తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు బంగాళాఖాతంలో గల్లంతయ్యారు. వారిలో ఐదుగురి మృతదేహాలు ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి గురువారం కొట్టుకొచ్చాయి. మిగిలిన నలుగురు కూడా జలసమాధి అయినట్లు భావిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... తుపానుకు ముందు తమిళనాడుకు చెందిన కొంతమంది మత్స్యకారులు చేపల వేటకు మూడు పడవల్లో బయలుదేరాయి. తుపాను సమాచారం తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యగా వాటిలో రెండు పడవలను కృష్ణపట్నం పోర్టు సమీపంలో నిలిపేశారు. మరో పడవలోని మత్స్యకారులు సమాచారం సరిగా లేక ముందుకుసాగారు. మురసు తుపాను ఒంగోలు సమీపంలో తీరం దాటే సమయానికి ఈ పడవ కొత్తపట్నం బీచ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో జలాల్లో ఉంది. తుపాను తీవ్రతతకు పడవ బోల్తా పడి అందులోని తొమ్మిది మందీ జలసమాధి అయినట్లు సమాచారం. తుపానులో చిక్కుకున్న సమయంలో బంధువులతో సెల్ఫోన్లో వారు మాట్లాడారు. తుపానులో చిక్కుకున్నట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే బంధువులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తమిళనాడు మెరైన్ పోలీసులు చివరిసారిగా సెల్ ఫోను సిగ్నల్ పాయింట్ ఆధారంగా కొత్తపట్నం సమీపంలో పడవ బోల్తా పడినట్లు గుర్తించారు. వారు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తపట్నం తీరానికి ఐదు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇవి తమిళనాడులోని కాశీమేడుకు చెందిన మత్స్యకారులవని స్థానిక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రకాశం కలెక్టర్ రాజబాబు ఈ సమాచారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేశారు. పోలీసులు ఐదుగురి మృతదేహాలను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. మరో నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.








కామెంట్లు (0)