ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరం ఎంబిబిఎస్ తొలి ఏడాది ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర పరిధిలో ఉన్న సీట్లలో 99.88 శాతం సీట్లు భర్తీ అయినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు బుధవారం నివేదిక అందించారు. మొత్తం 7,465 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా, వీటిలో 528 సీట్లను అఖిల భారత కోటాకు కేటాయించారు. మిగిలిన 6,937 సీట్లకుగానూ రాష్ట్ర పరిధిలో 6,929 సీట్లు (99.88) భర్తీ అయ్యాయి. భర్తీ అయిన సీట్లలో 4,250 మంది విద్యార్థినులు (61.34 శాతం), 2,679 మంది విద్యార్థులు (38.66 శాతం) ఉన్నారు. ఈ నెల 16తో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద ఉన్న 4,581 సీట్లు మొత్తం భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటాలో 2,356 సీట్లకు 2,348 సీట్లు భర్తీ అయ్యాయి. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 9, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 3 చొప్పున (రూ.20 లక్షలు) సీట్లు మిగిలాయి. వీటిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరిలోకి మార్చి (ఫీజు రూ.12 లక్షలు) భర్తీ చేసినట్లు తెలిపారు.
రూ.279 కోట్లకు చేరిన ఇహెచ్‌ఎస్ చెల్లింపులు : మంత్రి సత్యకుమార్
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్) కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు తాజాగా రూ.78.32 కోట్లు చెల్లించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు మొత్తం రూ.279 కోట్లకు చేరిందని మరో ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం రూ.768 కోట్లను చెల్లించిందన్నారు.








కామెంట్‌లు (0)