నీట మునిగిన నాలుగువేల ఎకరాలు పైచిలుకు వరి పంట
ప్రజాశక్తి - రాంబిల్లి (అనకాపల్లి జిల్లా) : అర్నబ్ తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు శారదా నదికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో రాజాల వద్ద గట్టుకు బుధవారం గండి పడి గురువారానికి అదికాస్త పెద్దదైంది. దీంతో, రాంబిల్లి మండలంలోని పి అగ్రహారం, మర్రిపాలెం, కొమరపల్లి, వైలోవ, పెదకలవలపల్లి తదితర గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలకుపైగా వరి పంట నీటమునిగింది. గట్టు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వరద నీటితో పంట పొలాలు మునిగిపోవడంతో బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎపి రైతు సంఘం నాయకులు గురువారం రైతులతో కలిసి ముంపునకు గురైన పంట పొలాల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు జి దేవుడు నాయుడు మాట్లాడుతూ.. శారదా నదికి వరద ఉధృతి పెరిగిన ప్రతిసారీ రాజాల వద్ద గండి పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత ఏడాది వరదల సమయంలో గండి పడిన ప్రాంతంలో ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టలేదన్నారు. రాంబిల్లి మండలం ఇప్పటికే కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ తరుణంలో అక్కడక్కడా వేసిన పంట కూడా తుపాన్ వల్ల దెబ్బతిందని, ముంపు బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)