శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాజువాకలో కూటమికి ఝలక్‌....

3 రోజుల క్రితం

gajuwaka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 08:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఎమ్మెల్యేగా పల్లాకు అధిక మెజార్టీ వచ్చిన చోటే నేడు ప్రతికూలత

ప్రజాశక్తి- విశాఖ : గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో గాజువాక, అగనంపూడి జోన్‌ ‌పరిధిలో కూటమి ప్రభుత్వానికి ఓటర్లు ఝలక్‌ ఇచ్చారు. శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక ప్రజలు లక్ష మెజార్టీతో గెలిపించారు. రెండేళ్ల అనంతరం జరిగిన జివిఎంసి ఎన్నికల్లో ఆయన నియోజకవర్గంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. జివిఎంసి గాజువాక, అగనంపూడి జోన్ల పరిధిలో 24 వార్డులకు గానూ టిడిపి 9, జనసేన 4, బిజెపి 2 కలిసి 15 వార్డుల్లో గెలుపొందగా, వైసిపి -5, సిపిఎం- 1 స్వతంత్రులు- 3 వార్డుల్లో గెలుపొందారు. అంటే 9 వార్డుల్లో కూటమికి వ్యతిరేక పవనాలు వీచాయి. కూటమి గెలుచుకున్న కొన్ని వార్డుల్లో స్వల్ప మెజార్టీ ఉండడం గమనార్హం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల తొలగింపు ప్రభావం తీవ్రంగా పడినట్లు స్పష్టమవుతోంది.

నిర్వాసిత కాలనీలో 92వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి గొందేసి శ్రీదేవి, 94వ వార్డు వైసిపి అభ్యర్థి ధర్మాలు రాధికను నిర్వాసితులు గెలిపించారు. 99వ వార్డు వడ్లపూడి నిర్వాసిత కాలనీ ప్రజలు కూడా వైసిపికి చెందిన కోమటి శ్రీనివాసరావును గెలిపించారు. నిర్వాసిత కాలనీలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. 91వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన బొడ్డు నరసింహ పాత్రుడు స్వల్ప ఆధిక్యంతోనే గెలుపొందారు.

కొన్ని వార్డుల్లో పలువురు వైసిపి నాయకులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫిక్సింగ్ పాల్పడ్డారని, దీని వల్ల వైసిపి నుంచి సరైన అభ్యర్థులను పెట్టలేదని ఆరోపణలు తీవ్రంగా వినిపించాయి. వైసిపికి సరైన అభ్యర్థులను కేటాయించకపోయినప్పటికీ ఓటర్లు ఆ పార్టీ పట్ల ఆధరణ, కూటమి పట్ల వ్యతిరేకత చూపారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయాలు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కారణంగానే ఈ ఫలితాలు ప్రభావితం అయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

గాజువాక జోన్‌లో విజేతలు..

జివిఎంసి ఎన్నికల్లో గాజువాక జోన్‌ ‌పరిధి 19 వార్డుల్లో టిడిపి-9, బిజెపి -2, జనసేన-2, వైసిపి -4, స్వతంత్రులు-2 చోట్ల విజయం సాధించారు. 83వ వార్డులో తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాసరావు సమీప వైసిపి అభ్యర్థి సురేష్ పై గెలుపొందారు. 84వ వార్డులో వైసిపి అభ్యర్థి గుడివాడ వెంకట సాయి అనూష సమీప టిడిపి అభ్యర్థిపై గెలుపొందారు. 85వ వార్డులో బిజెపి అభ్యర్థి గొర్రిపాటి సునీత సమీప వైసిపి అభ్యర్థి భవానీపై విజయం సాధించారు. 86వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కాకి గోవింద్ రెడ్డి సమీప వైసిపి అభ్యర్థి సన్నీపై గెలుపొందారు. 87వ వార్డులో టిడిపి అభ్యర్థి చట్టి గోపి సమీప వైసిపి అభ్యర్థి ఉరుకూరి చందుపై గెలుపొందారు. 88వ వార్డులో బిజెపి అభ్యర్థి శిరసపల్లి నూకరాజు సమీప ప్రత్యర్థి సిపిఐ అభ్యర్థి ఎజె.స్టాలిన్‌‌పై విజయం సాధించారు. 89వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రసాదుల విజయ సునీత సమీప వైసిపి అభ్యర్థి బాల శిరీషపై గెలుపొందారు. 90వ వార్డులో టిడిపికి చెందిన మహమ్మద్ రఫీ సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్‌డి గౌ‌స్‌పై ‌విజయం సాధించారు. 91వ వార్డులో టిడిపికి చెందిన బొడ్డు నరసింహ పాత్రుడు సమీప వైసిపి అభ్యర్థి మద్దాల అప్పారావుపై గెలుపొందారు. 92వ వార్డులో వైసిపి అభ్యర్థి గొందేసి శ్రీదేవి సమీప జనసేన అభ్యర్థి శ్రీజపై విజయం సాధించారు. 93వ వార్డులో జనసేనకు చెందిన దల్లి గోవిందరాజు సమీప వైసిపి అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై గెలుపొందారు. 94వ వార్డులో వైసిపి అభ్యర్థి ధర్మాల రాధిక సమీప టిడిపి అభ్యర్థి గరికిన జ్యోతిపై విజయం సాధించారు. 95వ వార్డులో జనసేన పార్టీకి చెందిన కోన రాధిక సమీప వైసిపి అభ్యర్థి దొమ్మేటి రమణారావుపై గెలుపొందారు. 96వ వార్డులో టిడిపికి చెందిన గంధం శ్రీనివాసరావు సమీప వైసిపి అభ్యర్థి మంత్రి శంకర్నారాయణపై విజయం సాధించారు. 97వ వార్డులో టిడిపికి చెందిన కోయిలాడ వెంకట సూరి శంకర్రావు సమీప వైసిపి అభ్యర్థి మనోజ్ కుమార్‌పై గెలుపొందారు. 98వ వార్డు‌లో స్వతంత్ర అభ్యర్థి జాజుల నాగేంద్ర కుమార్ సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి సుజాతపై గెలుపొందారు. 99వ వార్డులో వైసిపిఅభ్యర్థి కోమటి శ్రీనివాసరావు సమీప టిడిపి అభ్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ బొండా జగన్‌‌పై విజయం సాధించారు. 100వ వార్డులో టిడిపికి చెందిన నల్లూరి సూర్యనారాయణ సమీప వైసిపి అభ్యర్థి నయారా రెడ్డిపై గెలుపొందారు. 101వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన మాడిశ కనకరాజు సమీప వైసిపి అభ్యర్థి బొడ్డా సన్యాసిరావుపై విజయం సాధించారు.

అగనంపూడి జోన్‌‌లో విజేతలు...

ఉక్కునగరం : జివిఎంసి అగనంపూడి జోన్‌ ‌పరిధిలో జనసేన-2, సిపిఎం, వైసిపి, స్వతంత్ర అభ్యర్థులు చెరొకటి చొప్పున గెలుపొందారు. 102వ వార్డులో కూటమి నుంచి బరిలో ఉన్న జనసేన అభ్యర్థి గవర సోమశేఖర్ తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి బుర్ర సోమినాయుడుపై విజయం సాధించారు. 103వ వార్డులో జనసేన అభ్యర్థి మేడిశెట్టి విజయకుమార్ తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి గుర్రం శ్రీనివాసరావుపై గెలుపొందారు. మేడిశెట్టి విజయకుమార్‌ ‌స్టీల్‌‌ప్లాంట్‌‌లో ఉద్యోగం చేస్తూ ఈ ఎన్నికల కోసం రాజీనామా చేసి పోటీ పడ్డారు. 104వ వార్డులో వైసిపి అభ్యర్థి మద్ది శ్రీనివాసరావు సమీప పత్యర్థి జనసేన అభ్యర్థి కాకి అప్పలరెడ్డిపై విజయం సాధించారు. 106వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దుల్ల రామునాయుడు గెలుపొందారు. ఈ వార్డులో టిడిపి నుంచి మాజీ కార్పొరేటర్‌ ‌రౌతు శ్రీనివాసరావు, వైసిపి నుంచి గంజి గోవిందరావు పోటీ పడ్డారు. ప్రధాన అభ్యర్థుల పోటీని తట్టుకొని స్వతంత్ర అభ్యర్థి రామునాయుడు విజయం సాధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్