- ప్రతి ఎకరాకూ రూ.30 వేలు పరిహారమివ్వాలి
- తుపానుకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన
- కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బలరాం
ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రంలో వరుస తుపాన్ల కారణంగా పంట నష్టపోయి అన్నదాత ఆక్రందనకు గురవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరనముడిలో తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు అనేక సమస్యలను బలరాం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రైతులను ఉద్దేశించి బలరాం మాట్లాడుతూ తుపాన్లకు వరి పంటంతా నాశనమైందని, రైతులు, కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందన్నారు. వరి దుబ్బులు మొత్తం కుళ్లిపోయాయని, ఒక్క కంకి కూడా పనికిరాకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, ఇప్పటికే ఎకరాకు రూ.40 వేలు వరకు పెట్టుబడి అయిందని, అరకొర పంట రక్షించుకునేందుకు అదనంగా మరో రూ.15 వేలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. కనీసంగా ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం అందించాలని, నష్టాన్ని అంచనా వేసి వాస్తవ సాగుదారులు, కౌలు రైతుల పేరిట పంట నష్టాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ప్రత్యేకంగా ఆదుకోవాలని, కౌలు రైతులకు నష్టపరిహారం, బీమా, అన్నదాత సుఖీభవ ఇవ్వాలని కోరారు. కొబ్బరి, అరటి, మామిడి, సపోట, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, పాడి రైతులు, తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులను ఆదుకోని పక్షంలో ఆహార ధాన్యాల కొరత వచ్చే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కౌలు రైతుల సంఘం మాజీ నాయకులు శేషపు అశ్రియ్య మాట్లాడుతూ తుపాన్లు వచ్చి పది రోజులు గడుస్తున్నప్పటికీ ఎంపి గానీ, ఎమ్మెల్యే గానీ రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)