గల్లంతైన తండ్రి కోసం చిన్నారి ఎదురుచూపులు
మత్స్యకార కుటుంబాల్లో మిన్నంటిన ఆవేదన
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా) : ‘నాన్నా... ఎక్కడికి వెళ్లావ్? ఎప్పుడు వస్తావ్?’... ఆ పసివాడి అమాయకపు ప్రశ్నకు ఆ తల్లి దగ్గర సమాధానం లేదు. కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ, ‘ఏడవకురా... నాన్న వచ్చేస్తాడు’ అంటూ కొడుకును గుండెలకు హత్తుకున్న ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేటలో మత్స్యకారుల ఇళ్ల వద్ద కనిపిస్తున్న ఇలాంటి ఘటనలు ప్రతి వారినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బతుకుదెరువులో భాగంగా చేపల వేటకు ఈ నెల 11న వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. రెండు వారాలుగా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఏడు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి.
మూగబోయిన గొంతులు... ఆగని కన్నీళ్లు
సుబ్బంపేటకు చెందిన గరికిన సింహాద్రి, సూరాడ కోదండ, కందాల రాము, సూరాడ చిన్న, గంపల ప్రకాశ్, తిర్రి నారాయణ, మేరుగు నారాయణ చేపల వేటకు వెళ్లారు. తొలి నాలుగు రోజులు ఫోన్లో మాట్లాడిన వారు, ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రాలేదు. ఇంట్లో ఫోన్ మోగితే చాలు తమవారే చేశారేమోనని ఆశగా ఎత్తడం, అవతలి వైపు మరొకరి గొంతు వినిపించగానే నిరాశకు గురువుతుండడం ఆ ఇళ్లలో నిత్యకృత్యమైంది. బోటులో 1,500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహారం తీసుకెళ్లారన్న ఒక్క మాటే ఇప్పుడు ఆ కుటుంబాలను బతికిస్తోంది. ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉండి తిరిగి వస్తారనే ఆశ వారిలో ఊపిరినింపుతోంది.
సంద్రం జల్లెడ... ఊరంతా ప్రార్థనలు
మెరైన్ పోలీసులు, కోస్టుగార్డ్ బృందాలు సముద్రాన్ని జల్లెడ పడుతున్నా ఫలితం కానరావడం లేదు. ప్రవాహాల వల్ల బోటు బంగ్లాదేశ్, మయన్మార్ లేదా ఇతర దేశాల జలాల్లోకి కొట్టుకుపోయి ఉండవచ్చనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ గంగమ్మ తల్లి తమ వారిని క్షేమంగా అప్పగించాలంటూ సుబ్బంపేట మత్స్యకారులు సంద్రానికి పూజలు చేస్తున్నారు.
వివరాల సేకరణ
జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, ఎఫ్‌డిఒ రామకృష్ణ బుధవారం సుబ్బంపేటలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. గల్లంతైన మత్స్యకారుల వివరాలను సేకరించారు. గాలింపు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు.
గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి : మంత్రి అచ్చెన్నాయుడు
గల్లంతైన ఏడుగురి మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వారి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని పేర్కొన్నారు. వారి ఆచూకీ గుర్తించేందుకు సహకారం కోరడంతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సముద్ర జలాల వైపు వెళ్లి ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత తీర రక్షక దళం, నౌకాదళం, ఒడిశా అధికారులు, రాష్ట్ర మత్స్యశాఖ సమన్వయంతో గాలింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. గల్లంతైన ఏడుగురిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.








కామెంట్‌లు (0)