శ్రీనగర్ : ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడానికి వ్యతిరేకించిన జమ్ముకాశ్మీర్ వక్ఫ్ బోర్డ్‌పై కేంద్రప్రభుత్వం శుక్రవారం కక్షసాధింపు చర్యలకు దిగింది. కాశ్మీరీ ముస్లిం మత పెద్ద మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్‌పై గృహ నిర్బంధం విధించింది. మరో మత పెద్ద మౌలానా రెహమతుల్లా ఖాసిమికి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ శుక్రవారం తనపై గృహనిర్బంధం విధిస్తారని ముందుగానే ఊహించానని మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్ వక్ఫ్ బోర్డ్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో వందేమాతం ఆలపించడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని అన్నారు. పర్యావరణ పరంగా అతి సున్నితమైన శేష్ నాగ్ ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో, అక్కడ తలెత్తనున్న విపత్తుల పట్ల స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. జామా మసీదులో శుక్రవారం సందర్భంగా ఇచ్చే ప్రసంగాన్ని, సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా అడ్డుకున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, ఆందోళనలు లేవనెత్తిన ప్రతీసారీ ఇదే పరిస్థితి ఎదురవుతుందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణని అన్నారు. తనపై జామా మసీదుకు వెళ్లకుండా గృహ నిర్బంధం విధించారని అన్నారు.
కాశ్మీర్‌లో అతిపెద్ద మత విద్యాసంస్థ అయిన బందిపొరాలోని దారుల్ ఉలూమ్ రహీమియాకు చీఫ్‌గా ఉన్న ఖాసిమికి సమన్లు జారీ చేయడంపై మిర్వాజ్ ఉమర్ ఫరూఖ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 23న శ్రీనగర్‌లో జరిగిన జమ్ముకాశ్మీర్ వక్ఫ్ బోర్డ్ డే కార్యక్రమంలో స్థానిక ఇమామ్‌లు, మత గురువులు హాజరయ్యారు. ఈకార్యక్రమంలో వందేమాతరం ఆలపించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ మత విశ్వాసాలను, మనోభావాలను కాపాడుకోవడానికి తమ గొంతుకు వినిపించకూడదా అని మిర్వాజ్ ఉమర్ ప్రశ్నించారు. ఆందోళనలను వ్యక్తపరిచే హక్కు కూడా లేదా అని కేంద్రాన్ని నిలదీశారు.







కామెంట్‌లు (0)