ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతి సమగ్రాభివృద్ధికి రూ.3,222 కోట్లతో బృహత్తర ప్రణాళిక

5 రోజుల క్రితం

తిరుపతి సమగ్రాభివృద్ధికి
           రూ.3,222 కోట్లతో బృహత్తర ప్రణాళిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 08:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అలిపిరి వద్ద యాత్రికుల టౌన్‌షిప్‌‌

- టిటిడి ఉద్యోగులకు నివాస లేఅవుట్లు

- తుడా-టిడిపి చేపడుతున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన

- వెంకటాద్రి యాప్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి- తిరుపతి(మంగళం) : తిరుమల–తిరుపతి ప్రాంతాన్ని మరింత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేలా చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, టిటిడి పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. యాత్రికులకు సమాచారం తెలిపేందుకు రూపొందించిన వెంకటాద్రి యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల తరహాలో తిరుపతిలోనూ అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ టూరిజం టౌన్‌షిప్, మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్, టిటిడి ఉద్యోగుల నివాస లేఅవుట్, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. అలిపిరి పరిసర ప్రాంతంలో రూ.2,750 కోట్లతో యాత్రికుల సమీకృత వసతి సముదాయాన్ని ఏర్పాటు చేసి 15 వేల మంది బస చేసే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఒకేసారి ఆరు వేల మంది యాత్రికులకు అన్నప్రసాదం అందించే సదుపాయాన్ని సుమారు రూ.120 కోట్లతో నిర్మించి సౌకర్యవంతమైన వసతి, నాణ్యమైన అన్నప్రసాదం, మెరుగైన రవాణా, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయాన్ని రూ.311 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.90 కోట్లతో 30 బస్‌ బేలతో కూడిన సమీకృత రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టిటిడి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సుమారు 418 ఎకరాల్లో 5,192 మంది ఉద్యోగులకు నివాస స్థలాలు కేటాయించనున్నామని, ఒక్కో స్థలం సగటున 1,800 చదరపు అడుగుల వరకు ఉండేలా ప్రతిపాదించామని వివరించారు. ఈ లేఅవుట్ అభివృద్ధికి సుమారు రూ.230 కోట్లు వ్యయం కానుండగా టిటిడి వాటా రూ.150 కోట్లు, ఉద్యోగుల వాటా రూ.80 కోట్లు అని తెలిపారు. ఈ టౌన్ షిప్ ను పర్యావరణ హితంగా నెట్‌జీరో గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుమల చరిత్ర, శ్రీవారి వైభవం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను యాత్రికులకు పరిచయం చేసేందుకు పిలిగ్రిమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సలిజాముల వెంకటేశ్వర్, తుడ ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి ఎంఎల్ఎ ఆరణి శ్రీనివాసులు, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఇఒ ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్