బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

1 గంట క్రితం

సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం
- ‌పరీక్షల సంస్కరణల టాస్క్‌‌ఫోర్స్‌ చైర్మన్‌ నందన్‌‌ నీలేకనితో చంద్రబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ‌పరీక్షల సంస్కరణల టాస్క్‌‌ఫోర్స్‌ చైర్మన్‌ నందన్‌‌ నీలేకనితో చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో​ : విభిన్న రాష్ట్రాలు, భాషలు కలిగిన భారతదేశంలో అందరినీ కలుపుకొని వెళ్లేలా జాతీయ పరీక్షా విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పరీక్షల సంస్కరణ ఉన్నత స్థాయి టాస్క్‌‌ఫోర్స్‌ ‌చైర్మన్‌ నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సభ్యులు చంద్రబాబుతో సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. సచివాలయానికి వచ్చిన ఆయనకు ముందుగా విద్యాశాఖమంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఈ భేటీలో జాతీయ పరీక్షా విధానంపై టాస్క్ ఫోర్స్‌‌కు చంద్రబాబు సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఏకాభిప్రాయంతో పారదర్శకమైన, విశ్వసనీయమైన జాతీయ పరీక్షా విధానాన్ని రూపొందించాలని చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థికైనా, ఏ భాష మాట్లాడే విద్యార్థికైనా సమాన అవకాశాలు, న్యాయం జరిగేలా సంస్కరణలు ఉండాలని తెలిపారు. నేటి తరం విద్యార్థులు, యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షల విధానం ఉండాలని చెప్పారు. కేవలం పరీక్షలు, మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యం పెంపొందించేలా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న విధానాలు, సాంకేతికత వినియోగాన్ని వివరించిన మంత్రి లోకేష్‌ విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా పరీక్షల విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా భాష, విద్యా విధానం, ధృవీకరణల పరంగా ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ స్థాయిలో సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా లేక్ ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించి, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ​పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలను అరికట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్టు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని, ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు, ఎదురవుతున్న సమస్యలు, సంస్కరణలపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్