ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

22 గంటల క్రితం

kurnool
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మెకానికల్ సూపర్‌వైజర్ మృతి

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లోని కోక్ ఓవెన్ బ్యాటరీ–1లో శుక్రవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రాత్రి 11.40 గంటల సమయంలో ఓవెన్ టాప్‌ వద్ద 226వ నంబర్ కోక్‌సైడ్ మూత (లిడ్‌) లేకపోవడంతో పోస్‌బెల్ ప్రయివేటు కంపెనీకి చెందిన మెకానికల్ సూపర్‌వైజర్ సందీప్ కుమార్‌ ‌సింగ్‌ (50) ఓవెన్‌లో పడిపోయి మృతి చెందారు. ఆయన జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందినవారు. మూతలేని ప్రదేశాన్ని బ్లాంకెట్‌తో కప్పి ఉంచిన పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహం పూర్తిస్థాయిలో లభించలేదని, సుమారు ఐదు కిలోల మేర అవశేషాలు మాత్రమే లభించాయని తెలిపారు. ఈ ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన పరిస్థితులపై ప్లాంట్‌ ‌నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఓవెన్ వద్ద భద్రతా ప్రమాణాలు పాటించారా? మూత లేకుండా ఉన్న ప్రాంతాన్ని తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారు? ప్రమాదానికి బాధ్యులెవరు? అనే అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు తగిన పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు యాజమాన్యం భద్రతా చర్యల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ కేసును స్టీల్‌‌ప్లాంట్‌ ‌పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్