సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుబంధ విభాగాలదే కీలక పాత్ర

1 గంట క్రితం

sajjala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 07:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎన్నికల సన్నాహాక సమావేశంలో సజ్జల

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి అనుబంధ విభాగాలదే కీలకపాత్రని పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి, గ్రామస్థాయి వరకు పార్టీ శక్తిని సమన్వయంతో వినియోగించుకోవాలని వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర కోఆర్డినేటర్‌ ‌సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రతి అనుబంధ విభాగం పార్టీకి ఒక కీలక భాగమని, అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసినప్పుడే పార్టీ లక్ష్యాలను సాధించగలదని సజ్జల అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేసే ఒక అవకాశమని పేర్కొన్నారు. ప్రతి స్థానానికి ఒక అభ్యర్థితో సరిపెట్టకుండా, రెండు మూడు ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రత వరకు ప్రతి దశలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పార్టీకి ప్రస్తుతం రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు బలమైన ఆర్గనైజేషనల్ నెట్‌వర్క్ ఉందని సజ్జల పేర్కొన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకత్వంతో కేంద్ర కార్యాలయానికి నేరుగా కనెక్టివిటీ ఏర్పడిందని, ఎస్‌ఐఆర్ వంటి కార్యక్రమాల్లో ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడాలని, అభ్యర్థుల ప్రచారానికి కూడా అనుబంధ విభాగాలు అండగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా నామినేషన్లకు అడ్డంకులు, పోలీసు జోక్యం, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు లేదా ఇతర వివాదాస్పద ఘటనలు జరిగితే వాటిని తప్పనిసరిగా వీడియో రూపంలో రికార్డు చేయాలని సజ్జల సూచించారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేసే కార్యకర్తలు, నాయకుల పనితీరును ఈసారి వ్యవస్థీకృతంగా నమోదు చేయాలని సజ్జల చెప్పారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు పార్టీకి బలమైన అనుబంధ విభాగాల వ్యవస్థ ఉందన్నారు. దాదాపు 14 లక్షల మంది పార్టీ ఆర్గనైజేషనల్ వ్యవస్థలో ఉండగా, అందులో పెద్ద సంఖ్యలో అనుబంధ విభాగాల నాయకత్వం ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లలో మహిళా, యువజన, విద్యార్థి, రైతు, బిసి, ఎస్‌‌సి తదితర అనుబంధ విభాగాలు ప్రజా సమస్యలపై అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించాయని అభినందించారు. వైఎస్సార్‌సిపి మహిళా విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని, ధరల పెరుగుదలతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్