శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్వాన్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తం

16 నవంబర్, 2026

weather
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అక్వాన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సూచించారు. పంటలకు నష్టం జరగకుండా, మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సోమవారం ఆదేశించారు. రాష్ట్రంలో 21.32 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు పొలాల్లో ఉండగా, 2.55 లక్షల హెక్టార్లలో రబీ పంటలు వేశారని మంత్రి తెలిపారు. మొత్తం 23.87 లక్షల హెక్టార్లలో పంటలు ఉన్నాయని, ఇందులో వరి 13.60 లక్షల హెక్టార్లు, కంది 4.42 లక్షల హెక్టార్లు, పత్తి 1.92 లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తీరప్రాంతంలోని 10 జిల్లాల్లో 9.51 లక్షల హెక్టార్లలో పంటలు ఉండగా, అందులో 9.16 లక్షల హెక్టార్లలో వరి పంట ఉందన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందుగానే సేకరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 16 జిల్లాల్లో 2,69,831 హెక్టార్ల ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందులో మిరప 1,08,615 హెక్టార్లు, కొబ్బరి 98,526 హెక్టార్లు, పసుపు 24,469 హెక్టార్లతో పాటు అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 30,808 బోట్లలో నవంబర్ 16 ఉదయం 10 గంటల నాటికి 30,635 బోట్లు సురక్షితంగా తీరానికి చేరాయని, మిగిలిన 173 బోట్లను కూడా క్షేమంగా తీరం చేర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాకినాడలో 78, బాపట్లలో 38, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో చెరో 24, కృష్ణా జిల్లాలో 9 బోట్లు సముద్రంలో ఉన్నాయని వివరించారు. మత్స్యకారులకు ఇప్పటికే 1,08,250 వాయిస్ హెచ్చరికలు పంపించామని, 8,217 బోట్లను నాభిమిత్ర వ్యవస్థ ద్వారా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. తీరప్రాంతంలోని 555 మత్స్యకార గ్రామాలు, 350 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్