సిపిఎంకు ఒక జెడ్పిటిసి, 15 ఎంపిటిసి స్థానాలు
ప్రజాశక్తి- యంత్రాంగం: పరిషత్తు ఎన్నికల్లోనూ కూటమి సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 582 జెడ్పిటిసి స్థానాలు, 7,767 ఎంపిటిసి స్థానాల్లో అత్యధిక స్థానాలను గెల్చుకుంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో సిపిఎం అభ్యర్థి కొర్రా త్రినాథ్
గెలుపొందారు. రాష్ట్రంలోని 15 ఎంపిటిసిల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో ఏకగ్రీవం అయిన ఒక స్థానం కూడా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల జెడ్పిటిసి స్థానాన్ని టిడిపి అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో కైవశం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని వేంపల్లి జెడ్పిటిసి స్థానంలో 19,182 ఓట్లతో వైసిపి ఘన విజయం సాధించింది.
విజయనగరంలో బొత్స కుమార్తె ఓటమి
విజయనగరం జిల్లాలో 27 జెడ్పిటిసి స్థానాలకుగానూ సాయంత్రం ఏడు గంటలకు ఎనిమిది స్థానాల ఫలితాలు రాగా అన్నింటిలోనూ టిడిపి విజయం సాధించింది. బొండపల్లి నుంచి పోటీ చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత, బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష టిడిపి అభ్యర్థి పాశల నీరజ చేతిలో పరాజయం పొందారు. ఇటీవల వైసిపిని వీడి టిడిపిలో చేరిని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర... తెర్లాం జెడ్పిటిసిగా గెలుపొందారు. బొత్స నియోజకవర్గమైన చీపురుపల్లిలోని గరివిడి మినహా మిగతా స్థానాలనూ టిడిపి కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 449 ఎంపిటిసి స్థానాలుండగా, వాటిలో 11 స్థానాలు టిడిపికి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 438 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాలను కూటమి కైవశం చేసుకుంది.
పిఠాపురం నియోజకవర్గంలో ప్రాభవం తగ్గిన జనసేన
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ప్రాభవం తగ్గింది. పిఠాపురం ఎంపిపి అభ్యర్థిగా ఫోకస్ చేసి ఎంపిటిసి సభ్యునిగా జనసేన నుంచి బరిలోకి దింపిన టిల్లా వెంకట దినేష్ ఓడిపోయారు. ఆయనపై జనసేన రెబల్ అభ్యర్థి టిల్లా శివశంకర్ 287 ఓట్లతో గెలిచారు. కాకినాడ జిల్లాలో 401 ఎంపిటిసి స్థానాలకు ఐదు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 395 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 401 ఎంపిటిసి స్థానాలకుగానూ ఏడు ఏకగ్రీవమయ్యాయి. కూటమిదే పైచేయి సాధించింది. కాకినాడ పిఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో తాగునీటి సదుపాయం కూడా లేకపోవడంతో సిబ్బంది, ఏజెంట్లు ఇబ్బందులకు గురయ్యారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 19 జెడ్పిటిసి స్థానాల్లో అత్యధిక స్థానాలను టిడిపి, జనసేన గెల్చుకున్నాయి. 379 ఎంపిటిసి స్థానాల్లో ఏడు ఏకగ్రీవమయ్యాయి. 372 ఎన్నికలు జరిగాయి. కూటమి హవా కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 21 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కూటమి హవా కనిపించింది. మొత్తం 412 ఎంపిటిసిలకుగానూ ఏడు ఏకగ్రీవమయ్యాయి. 405 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చంద్రవరం ఎంపిటిసిగా టిడిపి అభ్యర్థి కాట్రూ శ్రీనివాసరావు 3 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
అనంతపురం జిల్లాలో మొత్తం 31 జెడ్పిటిసి స్థానాలు ఉండగా, వాటిలో మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 22 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టిడిపి కూటమి అధిక స్థానాలు సాధించింది. మొత్తం 450 ఎపిటిసి స్థానాలకుగానూ 97 ఏకగ్రీవమయ్యాయి. టిడిపి కూటమి అధిక స్థానాల్లో గెలుపొందింది. అనంతపురం నగరంలో జెఎన్‌టియులో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రంలో ఆత్మకూరు మండలం కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్‌ను పరిశీలించేందుకు వైసిపి నుంచి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడి రాజశేఖర్‌రెడ్డి సతీమణి నయనతా రెడ్డి విచ్చేశారు. అదే సమయంలో టిడిపి కౌంటింగ్ అభ్యర్థి రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు బాలాజీ రావడంతో ఎలాంటి ఘర్షణలూ జరగకుండా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
శ్రీసత్యసాయి జిల్లాలో 32 జెడ్పిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కూటమి అత్యధిక స్థానాలను గెల్చుకుంది. 397 ఎంపిటిసి స్థానాల్లో 20 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 377 స్థానాల్లో అత్యధికం కూటమి ఖాతాల్లో పడ్డాయి. గోరంట్ల మండలం బూదిలి ఎంపిటిసి ఫలితాల్లో వైసిపి గెలిచినప్పటికీ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదని హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద వైసిపి ఆందోళన చేపట్టింది. చెన్నేకొత్తపల్లి ఎంపిటిసి ఫలితాలు వైసిపికి అనుకూలంగా వచ్చినా రెండుసార్లు రీకౌంటింగ్ చేసినా ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టడంపై మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ ధర్మవరంలో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన తెలిపారు.
హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ పిఎ శ్రీనివాసరావు వెళ్లడంతో వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు వారు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. వైసిపి కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
కర్నూలు జిల్లాలో 26 జెడ్పిటి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజార్టీ స్థానాలను కూటమి గెల్చుకుంది. 432 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాలను కూటమి గెల్చుకుంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ వైసిపికి చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చాయి. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కో పార్టీకి ఒక ఏజెంట్‌కే అనుమతి ఇవ్వడంపై వివిధ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు ఏజెంట్లకు పాసులు జారీ చేసి, ఒక్కరికే అనుమతించడంపై ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరుగ్రూపులపై లాఠీఛార్జి చేయడంతో ఇద్దరు వైసిపి ఏజెంట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వైసిపి ఏజెంట్లకు అనుమతి నిరాకరించారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కౌంటింగ్ హాల్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కర్నూలులో వైసిపి యువనేత బైరెడ్డి సిద్దార్థరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మిగనూరు కౌంటింగ్ కేంద్రంలోకి టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్ ను పాస్ లేకుండానే లోపలికి పంపడంతో వైసిపి నాయకులు గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నంద్యాలలో 28 జెడ్పిటిసి స్థానాలకుగానూ ఎనిమిది ఏకగ్రీవం అయ్యాయి. 20 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాలను కూటమి గెల్చుకుంది. 376 ఎంపిటిసి స్థానాలకుగానూ 152 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 224 స్థానాలకు ఎన్నిక జరిగింది. కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకుంది. మహానంది మండలం అబ్బిపురం ఎంపిటిసి స్థానం నుంచి వైసిపి అభ్యర్థి నూర్ బాష గెలుపొందినా డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా ఆటంకం కలిగించడంపై శిల్పా చక్రపాణి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లడానికి బయలు దేరిన శిల్పచక్రపాణి రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆరు చోట్ల రీకౌంటింగ్
శ్రీకాకుళం జిల్లాలో 30 జెడ్పిటిసి స్థానాలకుగానూ కూటమి అత్యధిక స్థానాలను గెల్చుకుంది. 542 జెడ్పిటి స్థానాలకుగానూ 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 523 ఎంపిటిసి స్థానాల్లో అత్యధిక కూటమి విజయం సాధించింది. కొన్ని చోట్ల వైసిపి ఎంపిటిసి అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో విజయం సాధించడంతో టిడిపి ఏజెంట్లు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. అధికారులు అంగీకరించకపోవడంతో టిడిపి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. పొందూరు మండలం తోలాపి, కనిమెట్ట ఎంపిటిసి స్థానాల్లో వైసిపి అభ్యర్థులకు ఆధిక్యం ఉన్నట్లు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ చిలకపాలెం శివానీ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు రీకౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. టెక్కలిలోని నాలుగు ఎంపిటిసి స్థానాల్లోనూ రీకౌంటింగ్‌కు టిడిపి ఏజెంట్లు పట్టుబట్టడంతో రీకౌంటింగ్ చేపట్టారు.
గొల్లపూడిలో బ్యాలెట్ బాక్స్ ముందుగానే ఓపెన్ చేయడంపై అనుమానాలు
ఎన్టిఆర్ జిల్లాలో 16 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టిడిపి కూటమి అధిక స్థానాలను గెల్చుకుంది. 280 ఎంపిటిసి స్థానాలకుగానూ నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి హవా కనిపించింది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి ఎంపిటిసి స్థానాల ఓట్ల లెక్కింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. బ్యాలెట్ బాక్స్ ముందుగానే ఓపెన్ చేసి ఉండటంపై ఏజెంట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. బాక్స్ తెరిచిన తర్వాత కూడా కొన్ని బ్యాలెట్ పేపర్లపై ప్రిసైడింగ్ అధికారి (పిఓ) సంతకం లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వీటిపై వైసిపి అభ్యర్థులు, ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. కొటికలపూడి ఎంపిటిసి స్థానానికి పోలైన ఓట్లకు, బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లకు వ్యత్యాసం కనిపించింది. 2,432 ఓట్లు పోల్ కాగా, తీరా లెక్కింపు సమయానికి బాక్సులో 2,427 ఓట్లు మాత్రమే తేలాయి. మిగిలిన ఐదు ఓట్లు ఏమయ్యాయని వైసిపి ఏజెంట్లు లెక్కింపు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
మొవ్వ జనసేన అభ్యర్థి ఓటమి... టిడిపి రెబల్ గెలుపు
కృష్ణా జిల్లాలో 26 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 352 ఎంపిటిసి స్థానాలకుగానూ తొమ్మిది ఏకగ్రీవం అయ్యాయి. అత్యధిక స్థానాలు టిడిపి కూటమి ఖాతాలో పడ్డాయి. కొన్ని స్థానాల్లో వైసిపి గట్టి పోటీ ఇచ్చింది. మొవ్వ జడ్పిటిసిగా టిడిపి రెబల్ అభ్యర్థి గెలుపొందారు. అక్కడ జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. గన్నవరం జడ్పిటిసి స్థానంలో వైసిపికి ఆధిక్యత రాగా, బిజెపి అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ రీ కౌంటింగ్ జరిపినా వైసిపి అభ్యర్థే విజయం సాధించారు.
ప్రకాశం జిల్లాలో
27 జెడ్పిటిసి స్థానాలు ఉండగా, రెండు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 25 స్థానాల్లో ఒక స్థానం మినహా మిగతా అన్నీ కూటమి గెలుచుకుంది. 371 ఎంపిటిసి స్థానాలకుగానూ 151 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 220 స్థానాల్లో అత్యధిక స్థానాలను టిడిపి గెల్చుకుంది. బాపట్ల జిల్లాలో 20 జెడ్పిటిసిలకుగానూ ఒక స్థానం ఏకగ్రీవమైంది. 300 ఎంపిటిసి స్థానాలకుగానూ 27 ఏకగ్రీవమయ్యాయి. మార్కాపురం జిల్లాలో 21 జెడ్పిటి స్థానాలకుగానూ ఆరు ఏకగ్రీవమయ్యాయి. 274 ఎంపిటిసి స్థానాలకుగానూ 217 ఏకగ్రీవం కాగా, 57 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కూటమి గెల్చుకుంది.








కామెంట్లు (0)