అన్ని రూపాల్లో రాబడి అంచనా రూ.1,05,348 కోట్లు
రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు
129 ప్రాజెక్టుకు రూ.90,092 కోట్లు అంచనా
67 ప్రాజెక్టుల్లో రూ.41,062 కోట్లతో పనులు
62 ప్రాజెక్టులకు తక్షణ అవసరం రూ.49,030 కోట్లు
ప్రపంచ బ్యాంకు, ఎడిబి నుండి తీసుకోవాలని నిర్ణయం
అప్పల కోసం అధికారులతో కమిటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: అమరావతి రాజధాని పరిధిలో చేపడుతున్న పనుల కోసం అవసరమై నిధులు ప్రపంచ బ్యాంకు నుండి సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వు నెంబరు 1397 జారీచేసింది. దీనిలో అమరావతికి సంబంధించిన పలు కీలక వివరాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు ఎడిబి కింద అమరావతి రాజధాని నగర సమగ్ర ఆర్థిక ప్రణాళికను పరిశీలించడానికి సమీక్షించడానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొంది. అమరావతి రాజధాని నగర సమగ్ర ఆర్థిక ప్రణాళిక మార్చి 2026 నాటికి ఎపిసిఆర్డిఏ ఆర్థిక వ్యూహపత్రంపై ఆధారపడి ఉందని తెలిపింది. ఇప్పటికే రూ. 90,092 కోట్ల అంచనా వ్యయంతో 129 ప్రాజెక్ట్‌లను రూపొందించారని, వీటిలో, రూ. 41,062 కోట్ల వ్యయంతో 67 ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చుకుంటున్నారని తెలిపారు. మిగిలిన రూ. 49,030 కోట్ల వ్యయంతో కూడిన 62 ప్రాజెక్ట్‌లకు ఇంకా నిధులు సమకూర్చవలసి ఉందనీ పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 2046 వరకు అమరావతి రాజధాని ప్రణాళిక అమలు కోసం రూ. 1,33,302 కోట్ల అవసరం ఉందని తెలిపారు. దీనిలో అప్పలతోపాటు వేర్వేరు రూపాల్లో రూ. 1,05,348 కోట్ల మొత్తం రాబడిని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడుతుందని, ఈ లోటును పూడ్చడానికి అనేక మార్గాల్లో నిధులు సమకూర్చుకోవాల్సి ఉందని వివరించారు. ముఖ్యంగా భూముల అమ్మకం, సొంత ఆదాయాన్ని పెంచుకోవడం, బ్యాంకు రుణాలు, గ్రీన్ బాండ్లు, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) వంటి పద్దతుల్లో నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 18వ తేదీన జరిగిన సిఆర్డిఏ 66వ అథారిటీ సమావేశంలో తీర్మానం నెంబరు 721/2026 ప్రకారం ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం అమరావతి రాజధాని నగర సమగ్ర ఆర్థిక ప్రణాళికను పరిశీలించడానికి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థికశాఖ కార్యదర్శి, సిఆర్డిఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. సిఆర్ఢిఏ అదనపు కమిషనర్ మెంబరు కన్వీనరుగా ఉంటారు. ఈ కమిటీ రాజధాని సొంత ఆదాయాలు, ఖర్చులు, అప్పులు వడ్డీరేట్లు వంటి అంశాలను సమీక్షించి 2046 వరకూ ఎంత రాబడి ఉంటుందో పరిశీలిస్తుంది. అలాగే ఏ ఏడాదికి ఎంత అప్పు తీసుకోవాలనే అంశాన్నీ నిర్ణయిస్తుంది. దీని కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయి ఆర్థిక నిపుణులనూ ఆహ్వానించి సమావేశాలు నిర్వహించేందుకు కమిటీకి అధికారం కల్పించారు. కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుండి 60 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.








కామెంట్లు (0)