అమరావతి : బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. మయన్మార్-అండమాన్ ప్రాంతాల మధ్య ఈ వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు ఈశాన్య దిశగా సుమారు 580 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తోంది. వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రానున్న 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తాజాగా మరో వాయుగుండం ఏర్పడటంతో ఎపి పై దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వాతావరణశాఖ అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.








కామెంట్‌లు (0)