- అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల్లో ఘన విజయం
- తుడిచి పెట్టుకుపోయిన ఎబివిపి
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ విజయం దిశగా దూసుకెళ్తుంది. అధ్యక్షులుగా ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్ధి దిల్షాదా రైహాన్ ఘన విజయం సాధించారు. అలాగే, జాయింట్ సెక్రటరీగా ఎఐఎస్‌ఎ అభ్యర్ధి గెలుపొందారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్‌ఎఫ్‌ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ), అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఎస్‌ఎ), దళిత స్టూడెంట్స్ యూనియన్ (డిఎస్‌యు), ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరం (టిఎస్‌ఎఫ్) కూటమికి దిల్షాదా రైహాన్ 221 ఓట్లతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. టిఎస్‌ఎఫ్‌కు చెందిన కొర్రా నితిన్ చౌహాన్ మొత్తం 212 ఓట్లతో ఉపాధ్యక్ష పదవిని గెలుచుకోగా, ఎఎస్‌ఎ కు చెందిన ప్రతీక్ 177 ఓట్లు సాధించి ప్రధాన కార్యదర్శిగా ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎబివిపి-ఎస్‌ఎల్‌విడి కూటమికి చెందిన అధ్యక్ష అభ్యర్థి నరేష్ పొడిశెట్టి కేవలం 197 ఓట్లు సాధించి రైహాన్ చేతిలో ఓడిపోయారు. ఎస్‌ఎఫ్‌ఐ కూటమి చెందిన జిస్తి ఎస్‌ఇఎస్‌టి నుంచి పిహెచ్‌డి బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు సోమవారం జరగ్గా మంగళవారం క్యాంపస్ లో కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం ఆరు పోస్టులకుగాను మూడు ప్యానెళ్ల నుంచి 21 మంది పోటీ పడ్డారు. మొదటి రౌండ్ నుంచే ఎస్ఎఫ్‌ఐ ప్యానెల్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. రాత్రి 11 గంటల సమయానికి 35 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. సంయుక్త కార్యదర్శి పదవికి సిద్ధాంత్ ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఫలితాలు అర్ధరాత్రి తర్వాత వెలువడే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)