అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బిసి లకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ... ప్రభుత్వం గతంలో జారీ చేసిన జిఒ లను ఎపి హైకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి విదితమే. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణ జరిపిన హైకోర్టు, బిసి లకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించిపోతుందని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ జిఒ లు ఉన్నాయని పేర్కొంటూ ... 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జిఒ లను హైకోర్టు రద్దు చేసింది. అదే సమయంలో ... రిజర్వేషన్ల అంశంపై తుది నిర్ణయం తేలే వరకు ఎన్నికలు ఆపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఓటర్ల జాబితా నమోదు (సర్ ప్రక్రియ) తో సంబంధం లేకుండా, నిర్దేశిత గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేస్తూ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, బిసి లకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఎపి ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బిసి ల సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం దృష్ట్యా ఈ రిజర్వేషన్లు అవసరమని పేర్కొంటూ ... హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, బిసి రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. దీనిపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది.
బిసి రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎపి ప్రభుత్వం
03 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)