కీలక దశలో రాణించిన తిలక్, నితీశ్
రెండో టి20లో న్యూజిలాండ్‌పై టీమిండియా అద్భుత విజయం
క్రైస్ట్‌చర్చ్: టీమిండియాకు ఓటమి తప్పదనుకున్న దశలో తెలుగు కుర్రాళ్లు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతం చేశాడు. చివరి ఓవర్లలో మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పి న్యూజిలాండ్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఐదు టి20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యతలో నిలిచింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు టాపార్డర్ తడబడినా.. తిలక్, నితీశ్ అద్భుతం చేశారు. కీలక దశలో నమన్ ధీర్(31) కూడా బ్యాటింగ్‌లో రాణించాడు. టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి బౌలింగ్‌కే మొగ్గుచూపాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (7), డారిల్ మిచెల్ (6), ఫిన్ అలెన్ (16) త్వరగా వెనుదిరిగారు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. అయితే గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఫిలిప్స్ 43 బంతుల్లో 70 పరుగులు చేయగా, జాకబ్స్ 46 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించి న్యూజిలాండ్‌ను పటిష్ఠ స్థితికి చేర్చారు. దీంతో కివీస్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సంజూ శాంసన్ (14), వైభవ్ సూర్యవంశీ (4) త్వరగా ఔటయ్యారు. అభిషేక్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (7) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో భారత్ 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో తిలక్ వర్మ, నమన్ ధీర్ సాయంతో 6 వికెట్‌కు 42 పరుగులు జతచేయగా.. నితీశ్, తిలక్ మ్యాచ్‌ను ముగించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మకు లభించగా.. మూడో టి20 వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరగనుంది.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: షెఫర్ట్ (సి)తిలక్ వర్మ (బి)ఆర్ష్‌దీప్ 7, ఫిన్ అలెన్ (బి)ప్రిన్స్ యాదవ్ 16, మిఛెల్ (సి)తిలక్ వర్మ (బి)భువనేశ్వర్ 6, ఫిలిప్స్ (సి)నమన్ ధీర్ (బి)ఆర్ష్‌దీప్ 70, జాకోబ్స్ (సి)అక్షర్ (బి)నితీశ్ కుమార్ 58, సాంట్నర్ (నాటౌట్) 4, బ్రాస్‌వెల్ (నాటౌట్) 10, అదనం 9. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 180 పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/18, 3/41, 4/157, 5/165
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-50-1, ఆర్ష్‌దీప్ 4-0-33-2, ప్రిన్స్ 4-0-30-1, నమన్ ధీర్ 1-0-7-0, అక్షర్ 4-0-28-0, నితీశ్ 3-0-31-1.
ఇండియా ఇన్నింగ్స్: సంజు శాంసన్ (సి)ఫిలిప్స్ (బి)డఫీ 14, అభిషేక్ (సి)స్మిత్ (బి)సాంట్నర్ 27, సూర్యవంశీ (సి)మిఛెల్ (బి)స్మిత్ 4, శ్రేయస్ (బి)సాంట్నర్ 7, అక్షర్ (సి)మిఛెల్ (బి)సాంట్నర్ 11, తిలక్ వర్మ (నాటౌట్) 51, నమన్ ధీర్ (సి)ఫిలిప్స్ (బి)సాంట్నర్ 31, నితీశ్ కుమార్ (నాటౌట్) 26, అదనం 10. (19.5ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 181పరుగులు.
వికెట్ల పతనం: 1/40, 2/44, 3/56, 4/69, 5/70, 6/112
బౌలింగ్: హెన్రీ 2-1-11-0, డఫీ 3.5-0-41-1, ఫెర్గుసన్ 3-0-37-0, బ్రాస్‌వెల్ 4-0-35-0, స్మిత్ 3-0-34-1, సాంట్నర్ 4-0-21-4.








కామెంట్‌లు (0)