- అమరవీరుల సేవలు చిరస్మరణీయం
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాంతిభద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు శాఖకు పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోయేలా, ప్రతి ఒక్కరి ఆస్తికి భద్రత కల్పించేలా పోలీసులు పనిచేయాలని అన్నారు. నేరాలను ఛేదించడమే కాకుండా వాటిని నివారించడమే ఉత్తమ పోలీసింగ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్ మైదానంలో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమర జవాన్ స్మృతి చిహ్నం వద్ద సిఎం చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సిఎం ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా దర్యాప్తు విధానాలను మార్చుకోవాలని సిఎం సూచించారు. సిసి కెమెరాలు, డేటా విశ్లేషణ, డ్రోన్లు, కృత్రిమ మేధస్సు (ఎఐ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ఎపి పోలీసులకు దేశవ్యాప్తంగా అగ్రస్థాయి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఒక్క ఫోన్‌కాల్, లింక్, మెసేజ్‌తో సైబర్ నేరగాళ్లు ప్రజల జీవితకాల సంపాదనను దోచుకుంటున్నారని, చదువుకున్నవారు సైతం ఈ నేరాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో జరిగే నేరాలను సహించవద్దని, రౌడీయిజం, సామాజిక వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అశాంతి, అభద్రత ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రారని చెప్పారు. అందుకే తాను ఎల్లప్పుడూ శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ఎపి కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ భద్రతకు భంగం కలిగించే కుట్రలను ఛేదించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని అభినందించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ దేశ సరిహద్దుల రక్షణతోపాటు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజల రక్షణకు, చట్ట పరిరక్షణకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడటంతోపాటు ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల ఎడిజి మధుసూదన్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)