అమరావతి : తెలుగు రాష్టాల్లో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం మరింత బలపడింది. ఆదివారం ఉదయం 08:30 గంటల సమయానికి ఇది వాయుగుండంగా మారినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కి.మీ., చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కి.మీ., పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
వాయుగుండం ప్రభావం ఉత్తరకోస్తాపై తీవ్రంగా ఉండనుందని ప్రకటించింది. ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీరప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం, మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లుకు కురిసే అవకావం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.








కామెంట్‌లు (0)