శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమస్యలపై ప్రశ్నిస్తే నోటిసులా ?

23 గంటల క్రితం

సమస్యలపై ప్రశ్నిస్తే నోటిసులా ? 
- తక్షణమే ఎయు యాజమాన్యం ఉపసంహరించుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తక్షణమే ఎయు యాజమాన్యం ఉపసంహరించుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా, వాటిపై ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులకు క్రమశిక్షణ నోటీసులు జారీ చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయితేజ, జి.అజయ్ విమర్శించారు. ఇటీవల విద్యార్థి నాయకులు జి.అజయ్, తరుణ్‌కు జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎయు విసి కార్యాలయం ఎదుట నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్న యూనివర్సిటీ యాజమాన్యం కనీస సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టాబ్లిష్‌మెంట్ ఫీజుల పేరుతో విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని, యూనివర్సిటీలో విద్యుత్ ఛార్జీలను కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్ కేటగిరీకి మార్చాలన్న విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని వాపోయారు. పరిశోధక విద్యార్థులకు అవసరమైన ల్యాబ్‌లు, పరిశోధనా పరికరాలు, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం క్రమశిక్షణ ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎస్టాబ్లిష్‌మెంట్ ఫీజుల భారం తగ్గించాలని, విద్యుత్ ఛార్జీల కేటగిరీ మార్చాలని, ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, పరిశోధక విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విసి, ఉన్నతాధికారులు విద్యార్థి సంఘాలతో చర్చించి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. విద్యార్థి నాయకులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం ఎయు కార్యదర్శి అంజలి, ఉపాధ్యక్షులు ప్రగతి, నాయకులు సంజయ్, విశాల్, దోహిత్, నిఖిల్, సాగర్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్