- అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :
అమరావతిలో నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.29,340 వెచ్చించి బంగారంతో నిర్మిస్తున్నట్లు ఉందని, పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, ఎన్‌ఎసి ఛార్జీల మినహాయింపు ఇచ్చారని మాజీ సిఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడిన నిర్మాణాల్లో చదరపు అడుగు రూ.5 వేలు మించి లేదని అన్నారు. అమరావతిలోనే ఇంత రేటు ఎందుకని ప్రశ్నించారు. ప్రజల నెత్తిన అప్పులు పెట్టి కావాల్సిన వాళ్లకు భారీ కాంట్రాక్టులు అప్పగించి ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ భవనాలకు ఒకసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంచారని, అవే పనులకు మళ్లీ అంచనాలు పెంచి మొత్తం విలువ రూ.6,641 కోట్లకు చేర్చారని వివరించారు. అదనంగా అద్దాలు, ఎసిలు ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. దీంతో ఐదు భవనాల్లో 52.20 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.15,317 కోట్లు అవుతుందన్నారు.
అనకొండలా అమరావతి ఖర్చు : విజయసాయిరెడ్డి
అమరావతి నిర్మాణం ఖర్చు ఏటేటా అనకొండలా ఎందుకు పెరుగుతుందో ప్రజలకు సిఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని పరివర్తన్ రాజనీతి పార్టీ (పిఆర్‌పి) అధ్యక్షులు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జడలు విప్పుతోందనడానికి ధరల పెరుగుదల నిదర్శనమని పేర్కొన్నారు. జిఎడి టవర్ల నిర్మాణానికి, రెండేళ్ళలో రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయం ఎందుకు పెరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు.








కామెంట్‌లు (0)