టెలికాన్ఫరెన్స్‌లో వైసిపి అధ్యక్షులు జగన్
తుపాను బాధితులకు అండగా నిలవాలని శ్రేణులకు పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని, నామినేషన్ కేంద్రాలను ఆక్రమిం చడం తొలిసారిగా చూస్తున్నామని వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులపై పోలీసుల అండదండలతో దాడులు జరిగాయన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు సిఎం ఏజెంట్లుగా పనిచేశారని ఆరోపించారు. నామినేషన్ పత్రాల్లోని సర్టిఫికెట్లను ఆర్ ఓ లే చింపేయడం, తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఫోర్జరీ సంతకాలు చేసి నామినేషన్ పత్రాలను విత్‌డ్రా చేయించారని, బి - ఫారాలను ఆర్వోలే మాయం చేశారని, బహుశా ఇలాంటివి ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చని తెలిపారు. దారుణాలు చేసి ఏకగ్రీవాల పేరుతో గెలిచామని చెప్పకోవడం టిడిపి నాయకులకే చెల్లిందన్నారు. ఓసిలకు బిసి సర్టిఫికెట్లు ఇచ్చారని అన్నారు. దశాబ్దాల తరబడి హక్కులు అనుభవిస్తున్న భూములను లాగేసుకుంటున్నారని అన్నారు.
తుపాను బాధితులకు అండగా నిలవాలి
తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ నాయకులకు సూచించారు. విపత్తులను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటున్నారని, సోనా మసూరి బియ్యం కేజీ రూ.90 దాటిందని తెలిపారు. మంత్రి పయ్యావుల వియ్యంకుడు సహా టిడిపి నేతలు బియ్యాన్ని మార్కెట్లోకి రానీయకుండా బ్లాక్‌చేసి, ఎక్స్‌పోర్టు చేస్తున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ బియ్యం మాఫియాను ప్రోత్సహి స్తున్నారని విమర్శించారు. తుఫానుతో వరి, ఆక్వా, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు.








కామెంట్‌లు (0)