- రాజకీయ ఒత్తిళ్లపైనా విచారణ చేపట్టాలి
- చీకటి గోపీ కుటుంబానికి ఐద్వా పరామర్శ
ప్రజాశక్తి - తాడికొండ, ప్రతినిధి(గుంటూరు జిల్లా)
చీకటి గోపి మృతికి కారణమైన పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా సీనియర్ నాయకులు డి.రమాదేవి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో గోపి కుటుంబాన్ని ఐద్వా బృందం ఆదివారం పరామర్శించింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ దొంగతనం కేసులో సంబంధం లేని గోపీని పోలీసులు రెండు రోజులపాటు స్టేషన్‌లో ఉంచి ఆ తర్వాత భార్యకు అప్పగించారని, కుంటుతూ తీవ్రబాధతో వచ్చిన గోపీని కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు, తెనాలి ఆస్పత్రులకు తిప్పాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆ గాయాల గురించి వైద్యులు ప్రశ్నించి కేసు నమోదు చేయాల్సి ఉన్నా చేయలేదని, గుంటూరు జిజిహెచ్‌లో తెల్లవారుజామున 5.40 గంటలకు మరణిస్తే... కుటుంబీకులు, బంధువుల ఆందోళన అనంతరం సాయంత్రం 7.45 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపారు. గోపీని స్టేషన్‌కు పిలవడానికి ఎవరు ఒత్తిడి తెచ్చారో? విచారణ జరిపించాలని, స్థానిక టిడిపి నాయకుడు రాజా కారణమై ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై రికార్డులు, సిసి టివి ఫుటేజి పరిశీలించాలని కోరారు. గోపీ మృతిపై టిడిపి నాయకులు, హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకూ జరిగే అన్ని సంఘాలతో కలిసి ఐద్వా పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే ఆందోళనలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ గోపి భార్య జ్యోతిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, లోపలికి అనుమతించకుండా అర్ధరాత్రి వరకు బయట ఉంచడం దుర్మార్గమని, ఇప్పటివరకు పోస్ట్‌మార్టం నివేదిక రాకపోవడం శోచనీయమని అన్నారు. జనసేన కార్యకర్తగా గోపి ఉన్నందున, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బాధ్యత తీసుకుని న్యాయం చేయాలని కోరారు. పరామర్శించిన వారిలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి డి.శ్రీనివాసకుమారి, గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.అజయ్‌కుమార్, మండల కార్యదర్శి సిహెచ్.భాస్కరరావు పాల్గొన్నారు.
చీకటిగోపి కుటుంబానికి రూ.25లక్షలు ఇవ్వాలి : మందకృష్ణ మాదిగ
తాడికొండ పోలీసు స్టేషన్‌లో దొంగతనం నెపంతో దళిత యువకుడు చీకటి గోపిని పోలీసుల చిత్రహింసలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. గుంటూరులో ఆయన ప్రత్యక్ష సాక్షి చింతజల్లు గోపికృష్ణను మీడియా ఎదుట మాట్లాడించారు. పొన్నెకల్లులో టిడిపి నాయకులు నెల్లూరు రాజా వివాహేతర సంబంధం విషయంలో వ్యతిరేకంగా మాట్లాడినందుకు తమపై కుల దూషణలు చేస్తూ గొడవపడ్డారని, అది మనసులో పెట్టుకొని గ్రామంలో జరిగిన ఒక దొంగతనం కేసులో తమను ఇరికించి తీవ్రంగా కొట్టారని తెలిపారు. మందగకృష్ణ మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని, దోషులపై కేసులు నమోదు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)